Wednesday, June 4, 2014

శ్రీ వామన పురాణము Vamana puranam 1




హరి: ఓమ్ త్ర్యైలోక్య రాజ్య మాచ్చిద్య బలే రింద్రాయ యో దదౌ !
నమస్త స్మై సురేశాయ సదా వామన రూపిణే ||

బ్రహ్మ జ్ఞానియు, త్రికాల వేదియు, బ్రహ్మమానస పుత్రుడును అయిన పులస్త్య మహామునిని జాచి నారదుడిట్లడిగెను. " మహాత్మా! సమస్త సృష్టికి ఆధారభూతుడైన శ్రీమహావిష్ణువు వామనావతార మేల ధరించెనో విపులముగా నాకు చెప్పుము. "నారదుడు అడిగిన ప్రశ్నకు పులస్త్యుడు సంతోషించి వామన పురాణమును జెప్పుటకు ఆరంభించెను.

ఉమాశంకరులు
నారదా! పూర్వము మహేశ్వరుడు సతీదేవితో మందర పర్వతముపై నివసించెడివాడు. అట్లుండగా వేసవికాలము వచ్చెను. సతీదేవి శంకరునితో, "ప్రాణేశ్వరా! వేసవికాలము వచ్చినది. వేడి గాళుపులు ప్రారంభమైనవి. ఈ యెండల తాపమును భరించుటకు కష్టముగా నున్నది. మనమొక గృహమును నిర్మించుకొన్నచో ఇటువంటి  ఎండలనుండియు, వానలనుండియు, చలిగాలులనుండియు బాధలుండవు గదా! అట్లు సుఖముగా ఉండవలెనని కోరికగా నున్నది " అనెను. ఆమెతో శంకరుడు, "సతీ! నన్ను చూచుచున్నావు గదా! నేను కాసు కూడా లేనివాడను. కట్టుకొన్నది చూడుము పులి చర్మము. ఇంకను నాకు ఆభరణము లందువా! యజ్ఞోపవీత మొక సర్పము. చెవి కుండలములకు బదులుగా ఇంకా రెండు పాములు. భుజకీర్తులుగా మరి రెండు పాములు. చేతిలో భిక్షాకపాలము. ఇట్లున్న నేను నీకు గృహము నెట్లు నిర్మించి యియ్యగలను? దట్టమైన నీడగల ఏ చెట్టుక్రింద నైనను గ్రీష్మకాలమును గడిపి వేయుదము" అనెను. సతీదేవి మారుమాట లాడలేక పోయెను. వేసవికాలము చెట్లక్రిందనే గడిచిపొయినది. వర్షాకాలము వచ్చెను. మేఘములు ఏనుగువలె ఆకాశమున పరుగిడుచున్నవి. మెరుపులు కన్నులు మిరుమిట్లు గొలుపునట్లు మెరయుచున్నవి. జంతువులు, పక్షులు ఉండుటకు చోటులు వెదకుకొనుచున్నవి. అదిచూచి సతీదేవి ఆందోళన చెంది ఈశ్వరునితో, "నాథా! వేసవికాలము  కావున ఏచెట్లు క్రిందనో గడిపినాము. వర్షాకాలమున చెట్లక్రింద ఎట్లుండగలము? చెట్లు మహావర్షములను ఆపలేవు గదా! ఇప్పుడైననూ ఒక ఇల్లు కట్టుకొన్నచో ఈ వర్షబాధ నుండి తప్పించుకొనవచ్చు. ఏమందురు? " అని యడుగగా ఆయన " సతీ! ఏమందును? నా విషయము నీకు తెలియనిది ఏమున్నది? మేఘముల క్రింద నున్నచో మనము వర్శములకు తడిసి బాధ పడుదుము. అందుచేత మేఘములపై నెక్కి అక్కడ నివసించినచో మనకీ వానల వల్ల ఇబ్బంది యుండదు గదా! అట్లు చేయుదము " అని ఆమెను వెంటబెట్టుకొని మేఘమండలముపై నివాసము చేసెను. అప్పటి నుండి శంకరుని అందరును "జీమూత వాహనుడని" పిలిచిరి. ఆవిధముగా ఆ దంపతులు వర్షాకాలము గడిపిరి. శరత్కాలము వచ్చెను. నల్ల మేఘములు తెల్లబడెను. వానలు వెనుక బట్టినవి కనుక వర్షాకాలము మానస

సరస్సునకు బోయిన హంసలు తిరిగి తామర చెరువులకు వచ్చుచుండెను. పరమేశ్వరుడు తిరిగి మందరపర్వతము మీదికి సతీదేవితో సహా వచ్చెను. ఈ విధముగా ఎండలకాలము, వానలకాలము, చలికాలము ఆ దంపతులు వెళ్ళబుచ్చుచుండిరి. 



No comments:

Post a Comment