పరమేశ్వరుడు బ్రహ్మవిష్ణులను, ఇంద్రాది దేవతలను, వసువులను, రుద్రగణములను, మహర్షులను అందరను పెండ్లికి ఆహ్వానించెను. వారందరూ తమతమ వాహనములెక్కి వచ్చిరి. వారందరితోనూ శివుడు ఓషధి ప్రస్థమునకు తరలి వచ్చెను. మునిపత్నులు శివుని పెండ్లి కొడుకును జేసిరి. పరమసుందరుడైన శివుని జూచి పురప్రజలెల్లరును పరమానందము నొందిరి. అక్కడ పార్వతిని పెండ్లికూతురిని జేసిరి. పెండ్లి వేదిక సిద్ధమయ్యెను.
అక్కడ ఓషధి ప్రస్థమునకు ఒక ప్రాంతీయ ఆచారము ఉన్నది. పెండ్లికి ముందుగా ఒక విశాల ప్రదేశమున గడ్డి గాదములు లేకుండా శుభ్రపరచి, మంచి గంధపునీరు చల్లి, ముత్యాల తోరణాలు కట్టి, మ్రుగ్గులు పెట్టి, సిందూరము చల్లి ఎర్రగా జేయుదురు.
వినాయకోత్పత్తి
ఈ విధముగా పార్వతీ పరమేశ్వరుల పెండ్లి వేడుకలు పూర్తియైనవి. ఈశ్వరుడు విశ్వకర్మను పిలిచి మాకొక దివ్యమందిరమును నిర్మించి యిమ్మనెను. అతడు శివాజ్ఞను శిరసావహించి దివ్య భవనమును నిర్మించి ఇచ్చెను. పార్వతి సహితుడై శంకరుడు అందులో ప్రవేశించి ఇష్టభోగములను అనుభవించుచుండెను. ఒకప్పుడాయనకు మహాయోగము కలిగెను. పార్వతితో గూడి భవనము విడిచివచ్చుట లేదు. లోకము లన్నియు మొహాందకారములో మునిగిపోయినవి.
ఇందుకు మూలహేతువేమనగా - ఒకసారి నల్లగా నున్న పార్వతిని జూచి శంకరుడు పరిహాసపూర్వకముగా 'కాళీ' అని పిలిచెను. ఆమెకు కోపము వచ్చి "ఇంకా నీ చేత ఇట్లు పిలిపించుకోను చూడు" మని, అతని అనుమతితో మహాతపస్సు చేసెను. బ్రహ్మ ప్రత్యక్షమై వారము కోరుకోమనగా నాకీ నల్లనిదేహము వద్దు. బంగారు చాయతో మెరిసేది శరీరము కావలె అని కోరెను. బ్రహ్మ అట్లే వరమిచ్చెను. పార్వతి సువర్ణ దేహచ్చాయతో తన యింటికి వచ్చెను. ఆమెను జూచి పరమశివుడు మహామోహ పరవశుడయ్యెను.
దేవతలు ఇంద్రునితో అన్నారు "ఇపుడు పార్వతీ పరమేశ్వరులకు పుట్టెడువాడు మాహాశక్తిమంతుడై స్వర్గరాజ్యమును కబళించి వేయును. ఏదైనా ఉపాయమాలోచింపుము". దేవతల మాటలు విని ఇంద్రుడు ఉమాశంకరుల ఏకాంతమునకు భంగము కలిగించుటకు యత్నించెను. అగ్ని, హంసరూపముతో లోనికి వెళ్లి దేవతలు లనీ కోసము వేచియున్నారని చెప్పెను, శివుడు పార్వతిని వదిలి యావలికి వచ్చి దేవతలను జూచి విషయమేమని యడిగెను. " నీ మోహమును విడువనిచో లోకములు తల్లడిల్లుచున్నవి" అని చెప్పిరి. "అయినచో నా తేజస్సును మేలో ఎవరు భరించెదరు". అని శివుడు అడిగెను. అగ్ని "నేను భరించెదను" అనెను. అదే కార్తికేయుని జననమునకు కారణమయ్యెను.
No comments:
Post a Comment