Thursday, September 18, 2014

శ్రీ వామన పురాణము Vamana puranam 24




వామనుని విశ్వరూపము
విశ్వరూపుడైన వామనునికి చంద్ర సూర్యులు కన్నులు. ఆకాశము శిరస్సు. పాదములు భూమి. (శీర్ ష్నో ద్యౌ స్సమవర్త. పద్భ్యాం భూమి ర్దిశః శ్రోత్రాత్) (పురుష సూక్తము). దిక్కులే చెవులే అయ్యెను. కటి భాగము నందు విశ్వదేవులుండిరి. వాయువులు పొత్తికడుపు నందుండిరి. మన్మథుడు లింగమందుండెను. కడుపులో సముద్రములుండెను. లోపలి కడుపులో సర్వలోకములుండెను. దిశలు బాహువు లయ్యెను. ఎనమండ్రు వసువులు అష్టకరములైరి. పోట్టముడుతలందు నదులుండెను. అతని గర్భములో ఇషాపూర్తములు (ఇష్టము = దర్శపూర్ణ మాసక్రతువులు మున్నగు శ్రౌత కర్మముల సముచ్చయము. పూర్తము = నూతులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, స్మార్తకర్మము లాచరించుట.) సర్వయజ్ఞములు ఉండెను. చెవులయందు అశ్వినీదేవత లుండిరి. ముక్కున వాయు ఉండెను. ముఖమునందు బ్రాహ్మణులును, ఇంద్రాగ్నులు నుండిరి. (ముఖాదింద్ర శ్చాగ్నిశ్చ) భుజములందు రుద్రగణము లుండిరి. చంద్రుడు మనస్సులో ఉండెను. (చంద్రమామనసో జాతః) సత్యమే అతని మాట (వాక్కు) అయ్యెను. సరస్వతి నాలుక యయ్యెను. హృదయము బ్రహ్మస్థాన మయ్యెను. మారుద్గణములు అన్ని కీళ్ళయందు ఉండిరి. నడుమునందు లక్ష్మి, మేధ, ధృతి, కాంతి సర్వవిద్యలు నిలిచియుండెను. సర్వ నక్షత్రములును చూపులయ్యెను. సూర్యకిరణములే కేశము లయ్యెను. రోమములందు మహర్షులుండిరి. అదితి కంటమయ్యెను. సర్వమంత్ర విద్యలు అతని కంటహారము లయ్యెను. సర్వసూక్తములు అతనికి దంతములయ్యెను. ఇట్లు సర్వగుణ దేవతామయమైన రూపముతో పృథివిని (భూమిని) ఒక్కపాదముతో ఆక్రమించెను.  

అంతటంతట పెరిగిపోవుచున్న వామనునికి మొదట కన్నులుగానున్న సూర్యచంద్రులు స్తనములైరి. తరువాత మొలత్రాడు వంటివారైరి. ఆ తరువాత పాదములకు అందెలవంటివారై ప్రకాశించిరి. ఆ తేజో రాశియైన విశ్వరూపమును ఎవ్వరును కన్నెత్తి చూడలేకపోయిరి. సమీపించుటకు అసలే అశక్తులైరి. చిక్షురుడు అను రాక్షసుడు కాలిబొటన వ్రేలిని కొరుక బోయెను. వామనుడు వానిని ఆబొటన వ్రేలితోనే నలిపివేసెను.

ఇట్లు విక్రమించిన వామనుడు ఒకపాదముతో సర్వభూమండలమును, రెండవ పాదముతో స్వర్గాది సమస్త జ్యోతిర్లోకములను ఆక్రమించి, బలిచక్రవర్తితో ఇట్లనెను. "నాకు ఇంకొక అడుగునేల నీవు ఈయవలసియున్నావు. అది యిమ్ము. లేనిచో నిన్ను బంధించెదను".

No comments:

Post a Comment