Wednesday, September 24, 2014

శ్రావణమాస- నాగ పంచమి


శ్రావణమాసం వచ్చిన ఐదవ రోజున "నాగ పంచమి" గా పిలుస్తారు. ఈ రోజున గోడపై పసుపు, కుంకుమలతో నాగ మూర్తులను లిఖించిగాని, లేదా మృత్తికాదులతో నిర్మించిన సర్పాదులను కాని పూజించాలి. ఈ దినమున నాగులను ఆరాధించటం, తోబుట్టువులను ఆరాధించడం అనేక ప్రాంతాలలో ఆచారం.. ఈ రోజున గరుత్మంతుని కథని స్మరించుతారు. ఈ రోజు "గరుడ పంచమి" గా కూడా చేసుకుంటారు.
 ప్రాచీన కాలమునుండి భారతీయ సంస్కృతిలో ‘నాగపూజ’ సత్సంప్రదాయంగా ఆచరణీయమై ఉన్నది. మనం నిత్యం ఆరాధించే మహావిష్ణువు శేషశయనుడు. భూమండలాన్ని భరించే ఆదిశేషునకు యావత్ జాతి కృతజ్ఞతలు తెలిపే పర్వం ‘నాగపంచమి’. శ్రావణ శుద్ధ పంచమినాడు నాగులను మనం ఆరాధిస్తాం నాగుల ఆరాధన వేదకాలంనుంచీ ఉన్నదని అనేక ఆధారాలు చెబుతున్నాయి. శివుడు నాగాభరణుడు. వినాయకుడు నాగయజ్ఞోపవీతధారి. ‘వాసుకీ’ సర్పం క్షీరసాగర మథనంలో ప్రముఖ పాత్ర వహించింది.
కార్తీకమాసంలో వచ్చే నాగుల చవితి, మార్గశిరంలో వచ్చే ‘సుబ్రహ్మణ్య షష్ఠి’లాగానే శ్రావణంలో వచ్చే నాగ పంచమి కూడా సర్పాల నారాధించే పండుగ. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోనే కాక ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలలో కూడా నాగపంచమినాడు పుట్టలో పాలు పోసే సంప్రదాయం ఉంది.
శ్రావణశుద్ధ పంచమినాడు ఇంటి ద్వారానికి రెండువైపులా సర్పాల ఆకృతులను వేసి విధి విధానంగా లేత గరిక, దర్భ, గంధపుష్పాదులు, పెరుగు మొదలైన వాటిలో అర్చించి బ్రాహ్మణులకు సంతర్పణ చేసి భక్తితో నాగేంద్రుని పూజించినవారికి సర్పభయం ఉండదని అంటారు.
నాగపంచమి ప్రాశస్త్యాన్ని సాక్షాత్ పరమ శివుడే వివరించినట్లుగా స్కాంధపురాణం ద్వారా తెలుస్తోంది. శ్రావణమాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు చేసే ‘నాగపంచమి’ అత్యంత ప్రాశ్యస్తాన్ని సంతరించుకొంది. దీనికి కారణం తనకుచేస్తున్న ఆదిశేషుని సేవకు సంతసిల్లిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకొమ్మనిఅన్నారట. అందుకు శేషసాయి ‘‘తాము ఉద్భవించిన పంచమినాడు సృష్టిలోని మానవాళి సర్పపూజ చేసేలాచేయుమని’’ కోరుకున్నాడట. ఆదిశేషుని కోరికను మన్నించిన మహావిష్ణువు ఈ నాగుల పంచమినాడు సర్పపూజ అందరూ చేస్తారని అభయం ఇస్తూ నేడు సర్పపూజ చేసినవారికి విషబాధలు కలుగవని, వారి వంశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలుఉండవని వరమిచ్చాడు. ఈ రోజు సర్పాలను పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్తారు. సర్పస్తోత్రాన్ని ‘నాగపంచమి’నాడు చదివినవారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి చిక్కులు ఏర్పడవు. అంతేకాక ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ పొద్దున, సాయంవేళల్లో పఠిస్తే విషభీతి నివారణతోపాటు సకల కార్యసిద్ధి చేకూరగలదు నాగులు వరమిచ్చారు.
తమను ఆరాధించిన వారికి ఎటువంటి హాని కల్గించకుండా వారిని నాగులు సంరక్షిస్తాయని అగ్నిపురాణం, స్కంధపురాణం, నారద పురాణాలలో ఉన్న నాగ విశిష్టత తెలుపుతోంది. నాగపూజ వల్ల వంశాభివృద్ధియే గాక సత్సాంతాన ప్రాప్తి చేకూరుతుందని శాస్త్ర వచనం.
కొందరు చవితి , పంచమి రోజులల్లో పాము పుట్టను పూజిస్తారు. వత్తితో చేసిన దారాన్ని పుట్ట చుట్టూ చుడతారు. పుట్టలో ఆవు పాలను పోస్తారు. పుట్టను పూజించుటకు అనుకూలత లేనివారు ఇంట్లోనే నాగ ప్రతిమను చేసి పూజిస్తారు. నువ్వుల పిండి, చలిమిడి, వడపప్పును నాగులకు నివేదనగా అర్పిస్తారు. ఈ రోజున పూర్తిగా నిరాహారంగాఉండలేనివారు నూనె తగలని ఆహార పదార్థాలను స్వీకరిస్తారు. తెలిసీ తెలియక మేం చేసిన తప్పులను మన్నించి మమ్ము కాపాడు తండ్రీ అని ప్రార్థిస్తారు. నాగపంచమిని వివిధ రాష్ట్రాల్లో కూడా వివిధ రకాలుగా ఆచరిస్తారు. నాగపంచమినాడు చెట్లునాటడం, పొలం దున్నడం వంటివి చేయరు. నూకను తీసుకొని మూకను ప్రసాదించి మమ్ము కాపాడే దేవతను నీవే నన్ని నాగదేవతను కొలవడం ఆచారం
 
 

No comments:

Post a Comment