Wednesday, July 16, 2014

శ్రీ బ్రహ్మాండ పురాణము10




దిగంబరుడ వై తిరుగుట పనికి రాదు .బట్ట కట్టుకొనుము " అని చెప్పిరి .పైగా యిట్లనిరి ." నీ విట్లు బట్టలు లేకుండా తిరిగినచో నీవు నీ పురుష చిహ్నమును పోగొట్టు కొందువు. "
అది విని పరమేశ్వరుడు ,"మునులారా ! నా లింగము భూమిపై బడునట్లు మీరు శపించు టెందుకు ? కేశవాదులకు గూడ అది సాధ్యము కాదు నేనే స్వయముగా నా లింగమును భూమిపై విడచు చున్నాను "అనగా ,మునులిట్లనిరి "నీ మహిమల సంగతి మాకేల ? నీవు సరిగా బట్టలు కట్టుకొని ,వెకిలి వేషములు వేయుట మానినచో ఇక్కడ నుండుము లేదా , ఇచ్చట నుండి నీ యిచ్చ వచ్చిన చోటికి బొమ్ము ."
ఈ మాటలు విన్న ఈశ్వరుడు వెంటనే అద్రుశ్యు డయ్యెను ,చూడగా లింగరూపమే అచ్చట నుండెను . పరమేశ్వరుడట్లు అద్రుశ్యు డగుటచే త్రిలోకములు స్తంబించెను .ప్రాణులకు పుట్టుకలు లేకపోయెను . సృష్టిలోని సమస్త వస్తువులను నిస్తేజము లయ్యెను. అగ్నికి ,సూర్య చంద్రులకు ప్రకాశము లేకపోయెను. నక్షత్ర గ్రహ సంచారములు విపరీతము లయ్యెను. మునుల యజ్ఞములు సాగుటలేదు . సాగినను ఫలములు దక్కుటలేదు . జీవుల సమస్త కార్యక్రమములు స్థంబించి పోయెను. దానికి కారణమేమో తెలియక మునులందరు ను బ్రహ్మ దగ్గరకు పోయి ,ఈశ్వరుని వికృత వేషమును ,దుండగములను .అతని దిగంబరత్వమును జూచి ముని కాంతలను ,ముని కన్యలును మోహ విభ్రాంత లగుటయు సమస్తమును వివరించిరి .
దానికి బ్రహ్మదేవుడు "ఆయన ఆది పురుషుడైన పరమేశ్వరుడు ఆయన వలననే మన మందరము బుట్టి జీవించు చున్నాము .ఇవన్నియు ఆయన లీలలు ఎట్టి తేజస్సుతో
ఈశ్వరుడు  లింగముగా మారెనో ఆ లింగమును పరమేశ్వర స్వరూపముగా భావించి సేవించి ఇష్ట సిద్దులు బొందుడు "అని సెలవిచ్చి పంపి వేసెను .
కలి ధర్మములు
కృత యుగములో జీవిత పర్యంతము చేసిన పుణ్యముల ఫలము ,త్రేతా యుగములో ఒక సంవత్సరము చేసినచో వచ్చును. అంతే ఫలము కలియుగములో ఒక రోజున చేసినచో వచ్చును.
కృత త్రేతా యుగములలో వేదములు ఒకే రాశిగా నుండగా ద్విజులు వాని నద్యయనము చేయుదురు .ద్వాపరమున కొంత కాలము పాటు అట్లే జరుగును .ద్వాపరార్ధము గడచిన తరువాత వేదము నాలుగు విభాగములు గా వేదవ్యాసునిచే చేయబడెను . అవి ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము ,అధర్వణ వేదము ఆ నాలుగు వేదములను అధ్యయనము చేసి ఆ నాటివారు ఆ ధర్మములను చాలావరకు పాటించెడి వారు .
ఆ తరువాత కలియుగము ప్రవేశించును .ప్రజలలో అసత్యము ,హింస వృద్ది యగును .అసూయ పెరుగును. కపట స్వభావము చాలా మందిలో కనిపించును . సజ్జనులను హింసింతురు . రోగములు కలుగును . అధర్మము పెచ్చు పెరుగును. నూతి కొక్కడు ధర్మాత్ముడుండి అతడు చేసిన ధర్మము గాని చెప్పిన మాట గాని ప్రజల మెప్పు పొందదు.

No comments:

Post a Comment