రాముడు ,ఆకృత వ్రణుడను తన అనుచరుని బిలిచి ," నేను యుద్దమునకు వచ్చుచున్నా "నని అర్జునకు చెప్పి రమ్మనెను . వాడు చెప్పి వచ్చెను. అర్జునుడు యుద్ద సన్నాహములు చేసెను. పరశురాముడు మహోదరుని స్మరించెను. అతడు రధమును ,ఆయుధములను దెచ్చి యిచ్చెను. దానిపై నెక్కి రాముడు దండ యాత్రకు వెడలెను . దివ్యాస్త్రములచే సైన్యములను చెల్లాచెదరు చేసి ,నాశన మొందించెను. అర్జునిని సామంతులను కడ తేర్చెను. అర్జునుడు తనకు దత్తాత్రేయుడు ఇచ్చిన వరముతో గర్వించి ,దుశ్శకునములను లెక్కచేయక రణరంగము నకు వచ్చెను. పరశురాము నొక గడ్డి పోచగా భావించెను . కాని యతనితో యుద్దము చేయుట చాలా కష్ట మయ్యెను.
రాముడు అతని రధమును కూల్చి ,గుర్రాలను జంపి వేసెను .భూమి మీద నిలిచినా యర్జునిని తన పరశువు తో కంటము నరికి చంపి వేసెను . అతని యభిమానులైన రాజులు కొందరు తన పైకి రాగా వారిని గూడా శస్త్రాస్త్రములను ప్రయోగించి సంహరించెను .
ఇట్లు అర్జునిని సంహరించిన తరువాత ,ఈ విషయమును గురువగు పరమ శివునకు జెప్పి ఆశీస్సులు పొందవలెనని పరశురాముడు కైలాసమునకు బోయెను. ఆ సమయమున పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో నుండిరి .లోనికి వెళ్ళబోయిన రాముని గణపతి నిలుచుండ బెట్టి ,"సోదరా ! ఉమా శంకరులు ఏకాంతమున ఉన్నారు ఇప్పుడు వారి యొద్దకు బోయి వారి యానందమును చెరుపరాదు . అది నరకమునకు కారణ మగును .సతీ పతుల ఏకాంతమునకు విఘ్నము కలిగించిన వాడు ఏడు జన్మములలో భార్యా వియోగము ననుభవించును .కావున కొంచెము సేపు ఆగుము "అనగా ,రాముడు ,ఏమేమి ! వింతగా మాటలాడు చున్నావే !వారి
బిడ్డల మైన మనకు కూడ నిషేదములున్నవా ? నేను సమయోచితముగానే మెలెగదను .నన్ను లోనికి బోనిమ్ము " అనెను. గణపతి వీలులేదనెను . వారిద్దరకిని పెద్ద వాగ్యుద్దము జరిగెను. కుమారస్వామి సర్ది చెప్పబోయెను. అతని మాటల నెవ్వరును వినలేదు. బాహా బాహిగా (మల్ల యుద్దము ) రణము సాగెను. గణపతి పరశురాముని చేతులతో పైకెత్తి భూర్భువ స్స్వర్గో కాదులైన ఊర్ధ్వలోకము లన్నిటిని చూపించి ,మహాసముద్రములో ముంచి వేయుటకు ఆలోచించు చుండగా రాముడు మహా భయార్తు డయ్యెను. భయపడిన రాముని కరుణించి విడిచి పెట్టి ,గణపతి నిర్వికారముగా నిలుచుండెను.
No comments:
Post a Comment