Friday, July 18, 2014

శ్రీ వామన పురాణము Vamana puranam 22




అటువంటి పురుషోత్తమునకు దానమిచ్చినచో సర్వదేవతలును సంతుష్టి నొందుదురు. పాత్రుడైన యితనియందు దాన బీజములు పడినచో అవి మొలకలెత్తి ఎంతటి మహాఫలములు యిచ్చునో ఎవరు చెప్పగలరు? ఒకవేళ ఆయన నాపై కోపించి నన్ను చంపునా? ఆయన చేతిలో చచ్చుటకంటే కావలసిన దేమున్నది?" అని బలి చక్రవర్తి పలుకుచున్నంతలో ఆ యజ్ఞశాలకు వామనుడు వచ్చెను.

బలిచక్రవర్తి వామనునకు నమస్కరింపగా ఆశీర్వదించి, యజ్ఞమును, అగ్నులను, ఋత్విజులను, సభాసదులను, ఇంతటి యజ్ఞమునకు యజమానుడైన బలిచక్రవర్తిని బహువిధముల ప్రశంశించెను. ఆయన మాటల కందరును సంతోషపడిరి. బలిచక్రవర్తి వామనునకు అర్ఘ్య పాద్యములిచ్చి పూజించి, " మహాత్మా! ఏమి కోరెదవు? ఏమి అడిగినను ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాను" అనెను. వామనుడు నవ్వి, భరద్వాజుని చూపి, "ఈయన నాకు పరమగురువు. అగ్నిహొత్రములు చేసికొనుటకు, సొంతముగా ఒక స్థలము లేక పరస్థలములో సరియైన సదుపాయములు లేక బాధపడుచున్నారు. ఆయన కోసము అడుగుచున్నాను. నా శరీర ప్రమాణమును బట్టి మూడడుగుల భూమిని దానమిమ్ము" అని యడుగగా బలి, భార్యయైన వింధ్యావళిని, కొడుకైన బాణుని జూచి నవ్వుచు, "చూచినారా! ఈయన ప్రమాణములోనే వామనుడు కాదు. కోరికలలో గూడ వామనుడే. ( న కేవలం ప్రమాణేన వామనో యం లఘుప్రియః) నావంటి త్రిలోకాధిపతిని గూడ మూడడుగుల భూమి మాత్రమె అడుగుచున్నాడు. బ్రహ్మ ఇతని నుదుట ఇంతే వ్రాసినాడేమో! కానిచో నా వంటి వాని వద్దకు వచ్చి మూడడుగుల నేలను యాచించునా?" అనుచు వామనుని జూచి "భగవన్! ఏనుగులు, గుర్రములు, స్త్రీలు, ధనములు, మణిభూషణములు, వస్త్రములు ఏమి కావలెనో కోరుకొనుము. శ్రీనివాసా! నీవు యాచకుడవు త్రిలోకాధిపతినైన నేను దాతను. నీ వదిగినది చాల స్వల్పము. ఇచ్చుటకు గూడ సిగ్గుపడుచున్నాను. భూలోకము భువర్లోకము,  స్వర్గలోకము, రసాతలము వీనిలో దేనిని ఇమ్మందువో చెప్పుము" అనగా వామనుడు "అవి యన్నియు నాకెందుకు? నే నడిగిన మూడడుగుల భూమి నాకిమ్ము. చాలును" అనగా విని బలిచక్రవర్తి వింధ్యావళి నీలు పోయుచుండగా వామనుని కాళ్ళు కడిగి " త్రిపాద ధరణీం తుభ్య మహం సంప్రదదో న మమ " అని దానధార వామనుని చేతిలో విడిచిపెట్టెను. దానధార చేతిలో పడగానే వామనుడు అవామనుడై విజ్రుంభించి సర్వవేదమయమైన విరాట్పురుషరూపమును (విశ్వరూపమును) చూపెను.

No comments:

Post a Comment