Thursday, July 10, 2014

శ్రీ వామన పురాణము Vamana puranam 20




మీకు వినాశనకాలము దాపురించినది. కావుననే మాధవుని నిందించుటకు పూనుకొంటివి. అతని మహాత్మ్యము నీకేమి తెలియును? నీవు చెప్పిన రాక్షసులు, నీవు, నేను, బ్రహ్మాది దేవతలు, నరులు, సర్వజీవజాలము ఎవనివల్ల జీవించుచున్నామో అటువంటి సర్వవ్యాపకుడైన పరమాత్ముని నీవు నిందించుచున్నావు.  
నీకు నీ తండ్రి విరోప్చానుడు గురువు. అతనికి నేను గురువును. నాకు శ్రీమన్నారాయణుడు గురువు. అటువంటి గురుపరంపరలోని పరమ గురువును నిందించినావు. అంతేకాదు ఆయన నాకు ప్రాణము కంటే ఎక్కువ. అని తెలిసికూడా నీవు శ్రీనివాసుని నా మొగముమీదనే తెలికపరచినావు. కావున నీవు త్వరలో రాజ్యభ్రష్టుడవై పోదువుగాక" అని శపించెను.

బలిచక్రవర్తి అతనికి నమస్కరించి "తాతా! నేను అజ్ఞానినై యిట్లు విష్ణువును తిరస్కరించి మాట్లాడినాను. ఈ త్ర్యైలోక్యరాజ్యము కంటెను నీవంటి గురువులు దుర్లభులు. అందుచేత నేను నీ కోపగ్నిలో దగ్దుడనగుచు విచారించుచున్నాను" అని వేడుకొనెను. ప్రహ్లాదుడు "బలీ! నేనుకూడా కోపావేశములో ముందువెనుకలు ఆలోచింపక నిన్ను శపించినాను. నీవు ఈనాటినుండి విష్ణుభక్తి గలవాడవై యుండుము. దానివల్ల నీకు శాపము గూడా వరముగా మారును" అని పలుకగా బలిచక్రవర్తి సంతోషించెను.

వామన జననము
అదితికి నెలలు నిండినవి. వామ్నాకారముతో భగవానుడు జనించినాడు. ఆ సమయములో దేవతలు సంతోషమును, రాక్షసులు దుఃఖమును పొందిరి. వాతావరణమంతయు ఆనందకరముగా మారెను. సర్వప్రానులలోను ధర్మబుద్ధి జనించెను. బ్రహ్మదేవుడు స్వయముగావచ్చి వామనునికి జాతకకర్మ మొదలగు సంస్కారములు జరిపించెను. తరువాత వామనుని, అతని లీలావతార మహిమలను స్తుతించెను.

అపుడు వామను డిట్లనెను. " మీరందరును పూర్వము నన్నిట్లే స్తుతించినారు. అప్పుడు నేను ఇంద్రుని దేవరాజ్యమును మరల నిలుపుడునని ప్రతిజ్ఞ చేసినాను. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చి మీకు సంతోషమును కలిగించెదను."

No comments:

Post a Comment