Thursday, July 17, 2014

మార్కేండేయ పూరాణము 20




ఇట్లుండగా ఒక నాడు అవీక్షితుడు వేటకై, వైశాలి తపము చేయుచున్న అడవికే వెళ్ళెను. వేటాడుచుండగా ఒక స్త్రీ చేయుచున్న ఆర్త నాదము వినిపించెను. అతడు ఆ దిశకు వెళ్ళి చూడగా ఒక రాక్షసుడు ఒక ముని కన్యవంటి స్త్రీని ఎత్తు కొనిపోవుచుండెను. అవీక్షిత్తు అతని నడ్డగించి పోరాడ సాగెను. దృడ కేశుడను ఆ రాక్షసుడు అవీక్షిత్తు పరాక్రమమునకు ఆశ్చర్యపడి, "ఓ రాజకుమారా! నీవు అనవసరముగా ప్రయాసపడుచుంటివి. నేను గృహస్థుడైన వాని చేతిలో గాని చావను. నీవు బ్రహ్మచారివి.  నన్నేమియు చేయలేవు. తిరిగిపొమ్ము" అనెను. అవీక్షిత్తు " రక్షించుమని ప్రార్ధించుచున్న స్త్రీని వదిలిపోవుట క్షత్రియ లక్షణము కాదు. నీవన్నదే నిజమైనచో నేనీమెను మానసికముగా వివాహమాడుచున్నాను. కావున గృహస్థుడ నైతిని" అనుచు ఆ దృడ కేశుని యుద్దములో వధించెను. ఆ తాపసియైన వైశాలి ఇతడు అవీక్షితుడని గుర్తు పట్టెను. ఇతడును ఆమె వైశాలియని గుర్తించెను.
ఇరువురును పరమానంద భరితులై రాజమందిరమునకు వచ్చిరి. జరిగినది తండ్రికి చెప్పి అవీక్షిత్తు అతనిని ఆనందింపజేసెను. ఆ తండ్రి వారిరువురుకును విధి విధానముగా పాణి గ్రహణము కావించెను. ఆ దంపతులకు 'మరుతు' అను కుమారుడు జన్మించి, సకల విద్యలును నేర్చి తండ్రి తరువాత సింహాసన మెక్కి, జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కరములను పేర్లుగల సప్తద్వీపమును ఏకచ్చ త్రాధ పత్యముగా పరిపాలించి, ధర్మమూర్తియై షట్చక్రవర్తులలో ఒకడుగా పేరుపొందెను.  

భారత వర్షము - ప్రాధాన్యము
జంబూ ద్వీపమున పరిపాలించుచు ఆగ్నీంధ్రునకు కుమారుడు ఋషభుడు. అతని కుమారుడు భరతుడు. అతడు మహాపరాక్రమ వంతుడై జంబూద్వీపమందలి యీ దేశమును పాలించుట చేత దీనికి భారత వర్షమని పేరు గలిగినది. భారత, కింపురుష, ఇలావృత, కురు. భద్రాశ్వక, రమణక, హిరణ్యక, కేతుమాల, హరి అను తొమ్మిది వర్షము (దేశము)లలో భారత వర్షము గూడ ఒకటి. ఈ భారత వర్షమునకు ఉత్తరమున హిమాలయ పర్వత ములున్నవి. మిగిలిన మూడు దిక్కులందును సముద్రలున్నవి. ఈ వర్షము కర్మభూమి. ఈ వర్షమునందే శ్రీమన్నారాయణుడు దశావతారములెత్తి తన లీలా వైభవమును ప్రదర్శించినాడు. మిగిలిన వానికంటెను దీనికి ప్రాశస్త్యము ఇందువలననే కలిగినది. పుణ్యములు చేయు వారు, యజ్ఞయాగాదులు చేయువారు, వేదములు పటించువారు, ఈ వర్షమునం దేయుందురు. పుణ్యములు చేసిన వారికి ఇంద్రాది పదవులు లభించును. పాపాత్ములకు నరక ప్రాప్తియగును. మనుష్యులు పూర్వ కర్మవశమున చేయు పాప పుణ్యకర్మములను నివారించెడి శక్తి యెవ్వరికిని లేదు.   



No comments:

Post a Comment