Wednesday, July 16, 2014

శ్రీ బ్రహ్మాండ పురాణము22




రాక్షస గురువు శుక్రుడు
ఒకప్పుడు రాక్షసులలో బలవంతులైన ప్రభువులు దేవతల చేతిలో మృతి నొందిరి .దేవతలకు పట్టు చిక్కెను. మిగిలిన బలహీనులైన రాక్షసులను వెదకి వెదకి చంపు చుండిరి .వీరి ఉపద్రవమును తట్టుకొనలేక రాక్షసులు శుక్రాచార్యుని శరణము గోరుటకై శుక్రు నాశ్రమమునకు వెళ్ళిరి . అతడు రాక్షస జాతి క్షేమము గోరి వారిని కాపాడుటకై అనేక మంత్ర తంత్రములు సంపాదించుటకై ఈశ్వరుని గూర్చి సహస్ర వర్షములు తపము చేయుటకు పోయెను . రాక్షసులేమి చేయుటకును తోచక దిగులు పడి యుండగా బృగు మహర్షి బార్య వారిని చూసి ,"నేను నా ప్రాతి వ్రత్య ప్రభావము చేత మిమ్ములను రక్షించెదను. భయపడకు "డని వారికి అభయ మిచ్చెను. బృహస్పతి చెప్పిన యాలోచనను పురస్కరించు కొని రాక్షసుల మూకలపై బడి చంపుటకు ఇంద్రుడు వచ్చెను. బృగుపత్ని అతనిని తన మహిమచే స్తంబింప జేసెను .దేవతలు భయపడి పరువులెత్తిరి. అప్పుడు శ్రీ హరి యింద్రునితో ,"నీవు నాపై భారము మోపి నడువుము .నేను ,ఈమె సుముఖము నుండి నిన్ను తీసుకొని పోయేద " నని ,ఇంద్రుని అక్కడినుండి తప్పించెను. అట్లు తప్పించు చుండగా ఆమె "ఓ ఇంద్రా ! అప్పుడే ఏమైనది ? నిన్నును ,నీకు తోడు వచ్చిన ఈ నారాయణుని గూడా కాల్చి వేసెదను ."అని పలుకు చుండగా శ్రీహరి "ఇంద్రా ! విన్నావా ? ఆమె ఏమను చున్నదో :;ఈమె బారి నుండి మనము తప్పించు కొనుట ఎట్లు ?" అని యడిగెను.
ఇంద్రుడు "మధుసూదనా ! ఈమె ఆడుది యని శంకింపకుము .ఈమె దేవతలకు చాల అపకారము తలపెట్టినది .సంహరించుటే కర్తవ్యము" అని ప్రోత్సహించెను . విష్ణువు కూడా అదే మంచిపని యని తలచి శర సంధానము చేసి ,ఆ ఒక్క బాణముతో బృగుపత్ని తల యెగుర గొట్టేను. ఆమె ప్రాణములు పోయెను. అది చూచి బృగు మహర్షి "మాధవా ! స్త్రీని జంపరాదని ధర్మశాస్త్రములు చెప్పిన మాట నీ వెరుగుదువు. అన్నియును దెలిసి యుండి ఇట్లు స్త్రే వధ చేసిన నీవు భూలోకములో మనుష్యుడవుగా ఏడుజన్మము లెత్తుము"అని శపించెను .ఆ తరువాత బృగు మహర్షి తన భార్య శిరస్సును మొండెమునకు అతికించి దైవ ధ్యానము చేసి తన తపశ్శక్తితో ఆమెను పునర్జీవితు రాలిగా చేసెను.
ఇదంతయును జూచిన ఇంద్రునకు మహాభయము కలిగెను ."ఈ సంగతి శుక్రునకు దెలియును .తెలిసిన తరువాత అత డూర కుండునా? తన ప్రాణముల మీదికి దెచ్చును " అని యాలోచించి కుమార్తె జయంతిని బిలిచి ,"అమ్మా ! శుక్రాచార్యుడు ,శివుని యనుగ్రహము పొందుటకై వేయియేండ్లు తల క్రిందులుగా వ్రేలాడుచు క్రింద నున్న అగ్ని నుండి యెగయు చున్న దూమమునే యాహారముగా తీసికొనుచు తపస్సు చేయుచున్నాడు .అతని తపము పూర్తి కావచ్చు చున్నది .మేమతని తల్లిని జంపి అపకారము చేసినాము . తపము నుండి తిరిగి వచ్చి అతడేమి చేయునో యని భయపడుచున్నాను . నీవు తపము చేయుచున్న శుక్రుని దగ్గరకు బోయి ,అతనిని నీ మంచి మాటలతో సత్ప్రవర్తన తో లోబరచుకొని,అవసరమైన సేవలు చేసి .సంతోష పరచుము."అని చెప్పి పంపెను . 

No comments:

Post a Comment