Thursday, July 17, 2014

మార్కేండేయ పూరాణము 19




ఒక వేళ అట్టి రోగములున్నవారు సూర్యారాధనము చేసినచో ఆరోగములు  శాంతించి దేహారోగ్యము కలుగును. ఋగ్వేద మందలి మహాసౌరము, యజుర్వేద మందలి అరుణము ఈ రెండింటితో పాటు త్రిచ విధానముగా సూర్య నమస్కారములు చేసినచో లేదా చేయించుకొన్నచో సమస్త వ్యాధులును నశించి ఆరోగ్య వంతులగుదురు. అని చెప్పగా విని జైమిని, "మహానుభావులారా! మీవలన అనేక పుణ్యకధలను విన్నాను. మరుత్త రాజు కధను నాకు చెప్పుడు "అని అడుగగా పక్షులిట్లు చెప్పెను.  

జైమిని మునీంద్రా! పూర్వము విది శానగర రాజ్యమును విశాలుడను రాజు పాలించు చుండెను. అతనికొక కుమార్తె కలదు. ఆమె పేరు వైశాలి. ఆమె మహా సౌందర్యవతి యనియు, సద్గుణరాశి యనియు, మహా విద్వాంసురాలనియు ప్రసిద్ధ పొందెను. తండ్రి ఆమెకు స్వయంవరము చాటించెను. ఆ స్వయంవరమునకు చాలామంది రాజులు వచ్చిరి. బలాశ్వుని కుమారుడైన అవీక్షిత్తు స్వయంవర మండపము నుండి ఆమెను ఎత్తుకొని తన రధము పై కూర్చుండ బెట్టుకొని పోసాగెను. రాజులందరును అతని నెదిరించిపోరాడిరి. అతడు అసహాయ శూరుడై ఆ రాజులందరిని ఓడించివేసెను. పరాజయము చవిచూచిన ఆ రాజులందరును వంచనతో అవీక్షిత్తును చుట్టుముట్టిరి. అధర్మముగా యుద్దము చేసి పట్టి బంధించిరి. విశాలుడతనిని కారాగృహములో బంధించెను. తరువాత అతడు కుమార్తెతో "మిగిలిన రాజులలో నీకు నచ్చిన వానిని వరింపు"మని చెప్పగా, ఆమె" అవీక్షిత్తు పరాక్రమము ఎటువంటిదో కన్నులార చూచినాను. అతడు అతిలోక పరాక్రమవంతుడు. ఈ రాజులందరును అతనిని ధర్మయుద్దములో గెలువలేక మోసముచేసి బంధించినారు. ఇటువంటి వంచకులైన రాజులను నేను వరించలేను.      
ఎప్పటి కైనను ఆ అవీక్షితుడే నా భర్త "అని చెప్పెను. విశాలుడు మాటలాడక ఊర కుండెను. అవీక్షితుని తండ్రియైన బలాశ్వునకీ సంగతి తెలిసినది. వెంటనే సైన్యముతో వచ్చి విశాలుని యుద్దములో ఓడించి కుమారుని విడింపించెను. వైశాలిని ఇప్పుడు పెండ్లి యాడుమనగా అవీక్షితుడు, "నేను ఈ వైశాలి కన్నుల యెదుటనే శత్రువులచేతిలో వంచనవల్ల నైననేమి, పరాజితుడనై, ఆమె దృష్టిలో చులకన యైతిని. ఇంక నేనామెను వరించలేను" అని చెప్పగావిని యెవ్వరును మాటలాడ లేకపోయిరి. వైశాలి తన దురదృష్టమునకు విచారించి, వివాహము పై ఇష్టములేక అరణ్యమునకు పోయి తపస్సు చేసికొనుచుండెను. ఇటు అవిక్షితుడును మరియొక స్త్రీని వివాహమాడ లేక బ్రహ్మచారిగా ఉండి పోయెను. బలాశ్వుడు వృద్దుడై పోయెను. తన కొడుకు పెండ్లి చేసికొనలేదు. ఇదే విచారముతో ఆరాజు, ఒక నాడు అవీక్షితుని పిలిచి తన ఆవేదనను వెల్లడించెను. అవీక్షిత్తు తండ్రి మనోవేదనను గ్రహించి చివరకు పెండ్లి చేసికొనుటకు సమ్మతించెను. ముసలిరాజు కొడుకు పెండ్లి ప్రయత్నములలోనుండెను.   



No comments:

Post a Comment