గజనీ మహమ్మదు , తనకు వేంకటేశ్వరుడే స్వయముగా కనిపించి హితభోద చేసినందుకు సంతోషించి నను ,వెనుక తాను చేయించిన అకార్యములకు చాలా విచారించి ,అర్చకులను బిలిపించి వారికి తగిన సత్కారములు చేసి ,మీ మీ ఆలయములను దిరిగి నిర్మించుకొని దేవతా విగ్రహములను పునః ప్రతిష్టించు కొనుడు " అని అందుకు కావలసినంత ద్రవ్యమును ఉదారముగా నిచ్చి ,వారి జీవనోపాధికి తగిన మాన్యముల నిచ్చి పంపి వేసెను.చివరకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అర్చకులు మిగిలిరి .వారు సుల్తాను దర్శనము చేసికొని "మహాప్రభో ! తాము అర్చకు లందరును సమ్మానించి పంపినారు. మేము వెంకటేశ్వర స్వామి అర్చకులము .మాకు గూడా మా దేవుని విగ్రహము నిచ్చి పంపుడు ." అని ప్రార్దింపగా గజనీ మహమ్మదు తన ఇంటిలో నున్న వెంకటేశ్వర స్వామి విగ్రహమును దెప్పించి యిచ్చి ,తన అపరాధమునకు పరిహారముగా తన కుమార్తెను ఆయన సేవకు సమర్పించి ,రధములను ,ఏనుగులను ,గుర్రములను , మణి మాణిక్యములను ,చీని చీనాంబరములను వెంకటేశ్వరునకు కానుకగా ఇచ్చి ,నిత్యోత్సవ ధూప దీప నైవేద్యముల కొరకు కొన్ని గ్రామములను వ్రాసి ఇచ్చి సగౌరముగా సాగ నంపెను. తన కుమార్తెకు సర్వాభరణములను దాసీ జనమును ,ఆమె జీవనో పాదికై రెండు గ్రామములను గూడ ఇచ్చి ,ఇన్నిటిని రక్షణ చేయుటకై సైన్యము నిచ్చి ,పంపుచు తాను కూడా వారితో పాటు కొంత దూరము వెళ్లి వెనుకకు మరలి వచ్చెను .
శ్రీ మహాలక్ష్మీ
మ్లేచ్చులు దండయాత్ర చేసి ,వేంకటేశ్వరుని విగ్రహమును అపహరించు కొని పోయిన తరువాత శ్రీ మహాలక్ష్మియు ,భూదేవియు , నీలాదేవియు చాలా విచారములో మునిగి యుండిరి . తమ స్వామి తిరిగి యెప్పుడు వచ్చునా యని యెదురు చూచు చుండిరి .ఒకనాడు నారద మహా ముని ,శ్రీ భూ ,నీలాదేవుల దగ్గరకు వచ్చి వారికి నమస్కరించి ,లక్ష్మీ దేవినిట్లు ప్రార్ధించెను . "ఓ దేవీ ! నీవు కలవాడు కలవాడు .లేనివాడు లేనివాడే . సర్వ జగములందును నీవు జగన్మాతగా పూజింప బడినచో అష్టైశ్వర్యములు అరచేతిలోనికి వచ్చును. కౌస్తుభ రత్నముతో పాటు నిన్నుకూడా హృదయమున ధరించుట చేత శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడై ,జగత్పూజ్యత నొందేను. లోకమును రక్షించు ఉత్సాహ ప్రభు మంత్ర శక్తులును ,ఇచ్చాశక్తి ,జ్ఞానశక్తి , క్రియాశక్తి అను శక్తులను నీ వలననే శ్రీ మహా విష్ణువుకు అబ్బినవి . అనేక రూపములు ధరించి నిన్ను ఆరాధించు భక్తులకు కల్పద్రుమము వంటి దానవై కోరిన కోరికలిచ్చు చుందువు. నీ మహిమలను వర్ణించుటకు నేను ఎంత వాడను.?
No comments:
Post a Comment