Thursday, July 17, 2014

శ్రీ వామన పురాణము Vamana puranam 12




సుకేశి చరిత్రము
పూర్వము విద్యుత్కేశియను రాక్షసునికి సుకేశియను కుమారుడు కలిగెను. అతడు ప్రహ్లాదునివలె దైవభక్తియు, ధర్మబుద్ధియు గలవాడు. అతడు శంకరుని గూర్చి మహాతాపము చేసి శంకరుని మెప్పించి అతనివలన ఆకాశాగమనము గల నగరమును, శత్రువుల చేతిలో చావలేకుండుటయు, అజేయత్వములుగా పొందెను.

అతడా నగరములో దైత్యదానవులతో నివసించుచు, ఎక్కడికి పోవలెనన్న అక్కడికి నగరముతో సహాపోవుచు వచ్చుచుండెను.

ఒకప్పుడు మగధ దేశారణ్యములో తపము చేసికొనుచున్న ఋషులయొద్దకు బోయి వినయముతో నమస్కరించి, ఇహపరలోకములందు శ్రేయమును కలిగించు ధర్మములను చెప్పుడని అడిగి, అహింస, సత్యము, దొంగబుద్ధి లేకుండుట, శాంతము, దానము మున్నగునవి పరమ ధర్మములని తెలిసికొనెను. లోకములు, వాని సృష్టి, ఇంద్ర, కశేరు, తామ్రపర్ణ, గభస్తిమత్, నాగ, కటాహ, సింహళ, కుమారా, వారుణ, నామకములైన నవద్వీపముల విశేషములను, భారతవర్షము నందు తూర్పున కిరాత దేశములను, దక్షిణమున ఆంధ్రదేశమును, పటమట యవన దేశములను, ఉత్తరమున తురుష్క దేశములను వాని స్థితిగతులను, ఆయా దేశములందలి యాచార వ్యవహారములను, మన దేశమునందలి (భారతవర్షము) వర్ణాశ్రమాచార వ్యవస్థను, పాపపుణ్యములను వివరణముగా ఏ పాపములు చేసినవారే నరకములను అనుభవింతురో ఆవివరములను, పుణ్యతీర్ధసేవనము దాని ఫలములను అన్నియు విపులముగా దెలిసికొన్నవాడై, తన నగరమున సర్వధర్మములను సక్రమముగా జరుగునట్లు పాలింపసాగెను. ఆ ధర్మన్యాయములకు కట్టువది సూర్యచంద్రులా నగరమును వదలకుండిరి. మిగిలిన లోకమున చాలా అలజడి రేగినది. రాత్రింబవళ్ళు భేదము తెలియలేదు. సూర్యచంద్ర సంచారము లేకపోవుటచేత కాలగమము ఎట్లున్నదో తెలియకుండా బోయెను.

సుకేశి నగరమున గూడ అంతే జరిగెను. చంద్ర సూర్యులోకచోటే యుండుటచేత అది రాత్రియో పగలో అక్కడి వారికి తెలియలేదు. పగలనుచు కర్మానుష్టానములు చేసెడివారు కొందరు, రాత్రియనుచు నిద్రించువారు  కొందరు ఇట్లున్నది. సూర్యుడు నగరవాసుల మీద దయదలచి విశేషముగా ప్రకాశించుచుండగా చంద్రుడు వెలవెల బోవుచుండెను. చంద్రుని భార్య రోహిణి అదిచూచి తనభర్త బలహీనుడగుట అంగీకరింపక విష్ణువును గూర్చి తపముచేసి, అతని యనుగ్రహము వలన చంద్రుని మహాతేజస్విగా చేసెను. అతని ముందు సూర్యుడు కాంతిహీనుడయ్యెను. దానితో రాజనీచరులైన (రాత్రివేళల తిరుగువారు) రాక్షసులకు బలమెక్కువయ్యెను. అందరును చంద్రుని ఆరాధింపసాగిరి. సూర్యునివలే ఎండకాచి ఉడుకెత్తించకుండ ఈ చంద్రుడు మనలను చల్లగా చూచుచు ఆనందము కలిగించుచున్నాడని పొగడసాగిరి. సూర్యుడే ఉదయించనని చెరువులోని తామరలు వికశింపసాగెను. మనబంధువు చంద్రుడే ప్రకాశించుచున్నాడని కలువలు వికసింపసాగెను.

No comments:

Post a Comment