భాద్రపద మాసమున శుద్ధ చవితి యందు వినాయక
చవితి పండుగను జరుపుకొనుట మన హిందూ సంప్రదాయములో కలదు. ముందుగా
విఘ్నేశ్వరుని పూజ చేసి కాని మరో దేవునికి పూజ చేయరు. వినాయక చవితిని మన
భారత దేశంలోని అన్ని రాష్ట్రాల వారు భక్తి శ్రద్దలతో జరుపు కొందురు.
వినాయకుడు శివ, పార్వతుల పుత్రుడు. కార్తికేయునికి అన్న. ఒకనాడు పార్వతీ
మాత నలుగుపిండి ని ఒక బొమ్మగా చేసి దానికి ప్రాణం పోసి తన పుత్రునిలా
చూచుకొని స్నానము ఆచరించుచూ గుమ్మంలో కాపలా పెట్టగా, ఆ విషయం తెలియని
శంకరుడు ద్వారము వద్ద నున్న బాలుని శిరస్సును ఖండించెను. ఈ విషయము తెలిసి
పార్వతి రోదింపగా శివుడు, శివ భక్తుడైన గజాసురుని శిరస్సు తెచ్చి ఆ
బాలునికి అతికించి నాటి నుండి అతనిని దేవ గణ ములకు అధిపతిగా నియమించి
లోకమున ప్రప్రధమముగా పూజలందువానిగా చేసెను. వినాయక చవితినాడు కుడుములు,
ఉండ్రాళ్ళు మొదలగు పిండి వంటలతో వినాయకుని పూజించిన వారికి ఏ కార్యమందునూ
విఘ్నము కలుగదని కార్య సాఫల్యము కలుగునని ప్రతీతి.
ఈ విధమైన కధ మన భారత దేశంలో ప్రచారంలో
ఉన్నది. తన తమ్ముడగు కార్తికేయునితో పోటీపడి ఆ పోటీలో గెలువలేక వినాయకుడు
తల్లి దండ్రులగు శివ పార్వతుల చుట్టూ ప్రదక్షణము చేసి ' ఓం నమో నారాయణాయ'
అను మంత్రమును జపించుచూ మూడు సార్లు ప్రదక్షణము చేసి వారి ఆశీర్వాదము
పొందెను. కార్తికేయుడు అప్పటికీ సర్వ నదులలో స్నానం చేసి రాకపోవటం వల్ల
గణేశుడే గెలిచినట్లుగా శివ పార్వతులు ఇతనిని ముందు పూజించ వలెనని
గణాదిపతిగా నియమించిరి. తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రలలో ఈ
పండుగను బాగుగా జరుపుకొందురు. గణ పతి వాహనము మూషికము ప్రతి వీధిలో
పందిళ్ళు వేసి ఏడు నుండి పది రోజులు ఈ పండుగను జరుపుతారు . చత్రపతి శివాజీ
రాజుగా ఉన్నప్పుడు ఈ పండుగను అభివృద్ధి పరిచెను. మహారాష్ట్రలో ఇప్పటికీ అది
ప్రచారంలో ఉన్నది. ఐతే బ్రిటిష్ పరి పాలనలో ఈ సాంప్రదాయము
నిలిపివేయబడినది. కానీ తరువాత ఇదే తిరిగి అభివృద్ధి చెందినది. తొమ్మిది
రోజులు గడచిన పిమ్మట ఈ పూజలు జరిపిన విఘ్నేశ్వరుని అనేక రకముల వాయిద్యములతో
ఊరేగింపుగా తీసుకు వెళ్లి నదులందు గాని, చెరువులందు గాని నిమజ్జనం
చేస్తారు. ఈ విధంగా ప్రజలు గణపతి ని తొమ్మిది రోజులు ఘనముగా పూజించి
ఆనందిస్తారు.
No comments:
Post a Comment