Tuesday, November 12, 2013

శ్రీ దేవీ భాగవతము7




ఆ లోపల గోమేధిక సాల యున్నది. అక్కడ నంతయు గోమేధిక మయమే. విద్యాది శక్తులు ముప్పది యిద్దరు సేనలతో ఉందురు.

దాని కవ్వల వజ్రమయ దుర్గ మున్నది. అక్కడ అనంగరూప మున్నగు దేవి పరిచారిక లుందురు.

దాని పైన వైడూర్యమణుల ప్రాకార మున్నది. అక్కడ మున్నగు మాతృకలు లోక కళ్యాణము చేయుచుందురు. సైన్యములు గూడ నుండును.

దీని తరువాత ఇంద్రనీలమణి ప్రకార మున్నది. అక్కడ పదనారు రేకులు గల పెద్ద పద్మ ముండును. ఆ రేకులలో పదునారు శక్తు లుందురు. వీరు దేవి సేవలు నడుపుదురు.

ఆవల ముత్యాలతో నిండిన కోట యున్నది. అక్కడ దేవితో సమాన రూపముగల అన్మ్గా కుసుమాదులు అష్ట మంత్రిణు లుందురు. వీరెప్పుడును దేవికి జగద్వార్తలు  తెలుపు చుందురు.

ఆపైన మరకత సాలము. దానిలో షట్కోణయంత్ర మున్నది. గాయత్రీ, సావిత్రీ, బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు ఆ కోణములలో నివసింతురు. వేద, పురాణ, శాస్త్రములు తమ స్వరూపములతో ఇక్కడ నివసించును.

ఆవల ప్రవాళసాలము (పగడాల కోట) ఉన్నది. అక్కడ పంచభూతములకు నాధిపత్యము వహించు హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చష్మ అను శక్తు లుందురు.

దీని తరువాత రత్న మహాప్రాకార మున్నది. అక్కడ సప్తకోటి మహామంత్రములును, ఆది మహావిద్యలును ప్రకాశించుచుండును. ఈకోట తరువాతనే చింతామణి గృహము గలదు. "చింతామణి గృహాంత స్థాయై నమః" అని లలితా సహస్రములో నొక నామము. అక్కడ వేయి స్త్మభాల మండపాలు నాలుగున్నవి. శృంగారము, ముక్తి, జ్ఞానము, ఏకాంతము అని వాని పేరులు. కుంకుమ పూవుతోటల మీది నుండి వచ్చు సువాసన లక్కడ వ్యాపించును. శృంగార మండపములో దేవి కొలువు దీర్చును. ముక్తి మండపములో నుండి జ్ఞానమిచ్చును. ఏకాంత మండపములో మంత్రిణులతో గలిసి కార్యతంత్రములు నడుపును. ఇక్కడ శక్తి తత్త్వాత్మకములైన పది తొట్టెలు గలవు. వానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులు డెక్కలు (చిన్న చక్రములు) గా నుందురు. సదాశివుడు వాని పైన బల్లగా నుండును. దీనిపై కోటి మన్మథ సుందరుడైన మహాదేవుడును, అతని ప్రక్క  సర్వాలంకార శోభితయై పరమేశ్వరి యు అధి వసించి యుందురు. 

No comments:

Post a Comment