Wednesday, October 9, 2013

శ్రీ బ్రహ్మాండ పురాణము23




ఆమె కూడా అందుకు అంగీకరించి ,శుక్రాచార్యుడు తపము చేయు చోటికి బోయి అతనికి అవసరమైన సేవలు చేయుచుండెను. శుక్రుని తపము నిర్విఘ్నముగా పూర్తి యయ్యెను . శివుడు ప్రత్యక్షమై అనేక వరములతో పాటు మంత్రములను ఇచ్చెను .ఇన్ని దినములు తనకు సేవలు చేసిన జయంతిని జూచి "అమ్మాయీ ! నీవు చేసిన సేవలకు నేను చాలా సంప్రీతుడనైతిని. నీకేమి కావలెనో అడుగుము. "అని పలుకగా ఆమె యతనిని క్రీ గంట చూచుచు "ఓ మహానుభావా ! ఇంత తపము చేసినావు ఒక యువతీ మనసులో నేమున్నదో గ్రహింప లేవా ?" యని సాభిప్రాయముగా సమాధాన మిచ్చెను. శుక్రుడామే యభిప్రాయమును గ్రహించి ,"నేను నీతో ఒక్క పదేండ్లు కాపురము చేయుదును .ఆపైన నేను రాక్షసుల సంక్షేమమును జూచుటకై పోవలయును."అని పలికి ,యే ప్రాణికిని గనపడకుండా తన దేహమును మాయతో గప్పి ,జయంతితో సంసారము చేయుచుండెను. రాక్షసులు శుక్రాచార్యునికై చాలాచోట్ల వెదికిరి. ఆయన వీరికి కనబడలేదు.వారు విచారముతో నుండిరి. అప్పుడు బృహస్పతి ,శుక్రాచార్యుని రూపములో ఆ రాక్షసులకు గనిపించి "ఓ ప్రియ శిష్యులారా ! మీ కోసమని నేను అడవిలో ఘోరమైన తపము చేసి పరమేశ్వరుని మెప్పించి ఎన్నో విద్యలను సంపాదించుకొని వచ్చినాను .ఇంక మీరు దేవతలపై దండయాత్ర చేసినను పరాజయ ముండదు" అని ప్రోత్సహించెను .రాక్షసులాతనిని వేయి నోళ్ళతో పొగడిరి.
ఇచట ,శుక్రుడు పది సంవత్సరాల పాటు జయంతి కోరికను దీర్చి, అది పూర్తికాగానే ,జయంతీ ! నే నింక నా శిష్యుల యొద్దకు బోవలెను .నీవడిగినట్లు నీ కోరిక తీర్చితిని . ఇంక నాకు సెలవి "మ్మనెను. ఆమె శుక్రాచార్యుని సంతోషముగా సాగ నంపినది .అతడు రాక్షసుల యొద్దకు వచ్చునప్పటికి అక్కడ ఇంకొక శుక్రుడు ఉన్నాడు. అతడు దానవులకు మాయ మాటలు చెప్పుచుండగా వారు వెఱ్ఱి వెంగళప్ప ల వలె వినుచుండిరి.శుక్రుడు దానవులను జూచి "నేనే నిజమైన మీ గురుడను .ఈతడెవడో మాయలాడు " అనగా వారు సమాన తేజముతో ప్రకాశించు చున్న యిరువురను జూచి ,ఎవరెవరో గ్రహింపలేక మూడ చిత్తులైరి .విభ్రాంతి జెందిన వారిని జూచి శుక్రుడు ,"యీతడు దేవగురువైన బృహస్పతి నా వేషములో ఇక్కడికి వచ్చి మిమ్ముందరును మోసము చేయుచున్నాడు .మీరు నిజము తెలిసికోనలేక వీని మాటలు నమ్ముచున్నారు." అని చెప్పగా బృహస్పతి "దానవులారా ! ఇతడే నిజముగా బృహస్పతి తాను శుక్రాచార్యుడ ననుచు మిమ్ములను తప్పు దారి పట్టించు చున్నాడు .

No comments:

Post a Comment