ఏకపర్ణి, ఏకపాటలయు గూడా తపస్సునకు
వెళ్ళిరి. ఆమువ్వురును లోకమాతలు. ఉమ మహాదేవునాశ్రయించెను. ఆమె తపస్సునకు
లోకములు హాహాకారము చేసినవి. అప్పుడు బ్రహ్మ ఆమెకు ప్రసన్నుడై
"అమ్మా! నీవు జగజ్జననివి. నీవల్ల ఈ లోకములు నశింపరాదు కదా! తపము
చాలింపుము" అనగా ఆమె "పితామహా! నేనేమి కోరి తపము చేయుచున్నానో నీకు తెలియదా?" అని యడిగెను. బ్రహ్మదేవుడు
"అమ్మా! నీవు కోరినవాడు నిన్ను వెదుకుచు వచ్చి
నిన్ను వరించును. ఏరూపమున వచ్చి నిన్ను అనుగ్రహించునో తెలియదు. మేము
శివుని చరణసేవకులము గదా! అనెను. మునులు వచ్చి ఆమెతో "నీవు కోరుకున్న
శంకరుడే నీకు పతియగును. ఇంక నీ తపము చాలింపుము" అనిరి.
ఒకనాడు ఒక వామనుడు అచటికి వచ్చెను. అతని
కాళ్ళు పొట్టివి. చేతులు పొట్టివి. తల తుప్ప వలే నుండెను. ముక్కు వంకర
తిరిగి యుండెను. ఏ వైపునుండి చూచినను చాలా అసహ్యముగా నుండెను. అతడు మెల్లగా
పార్వతి యొద్దకు వచ్చి, "ఉమా! నిన్ను వరించుటకు వచ్చినాను" అని
పలుకగా, పార్వతి యొద్దకు వచ్చి, "ఉమా! నిన్ను వరించుటకు వచ్చినాను" అని పలుకగా, పార్వతి అతనిని తన యోగ మహిమచే పరమశివునిగా గుర్తించెను.
అవునుమరి. పరమశివుడు ధరింపని రూపమేమున్నది?" నమో హ్రస్వాయ చ వామనాయచ" అని
శ్రుతి చెప్పెను గదా!
పార్వతి, అతనిని అర్ఘ్య పాద్యాదులతో
పూజించి, "స్వామీ! నే నస్వతంత్రురాలను, నన్ను ఇచ్చుటకు నా తండ్రి యున్నాడు.
నాతండ్రి ఆమోదిమ్చినచో నేను నిన్ను వివాహమాడెదను" అని పలికెను.
ఆమె ధర్మయుక్తముగా పలికిన మాటలకు సంతోషించి ఆ కపట వేషధారి, "అయినచో నేను హిమాచలాదీశుడనే
అడిగెద" నని వెళ్లి, హిమవంతునిచేత పూజితుడై, తనకు అపర్ణ నిమ్మని అడిగెను.
హిమవంతుడు ఆలోచనలో పడెను". ఇతని రూపము
పరమవికారముగా నున్నది. ఇతనికి నాకుమార్తెను ఎట్లు ఈయగలను? కాదు పోమ్మనినచో యితడు శపించి
పోవునేమో" అని తలచి, ఆ వామనునితో నిట్లనెను. "అయ్యా! నీవు నా
కుమార్తెను ఇమ్మనుచున్నావు. నేను నా కుమార్తెకు స్వయంవరము చాటింతమనుకొనుచున్నాను.
నీవు స్వయంవరమునకు వచ్చి నీ అదృష్టం పరీక్షించుకొనుము ".
ఈ మాటలు విని ఆ కుబ్జుడు, పార్వతి దగ్గరకు వెళ్లి, "అపర్ణా! నీ తండ్రి నీకు స్వయంవరము చాటించునట. అందులో నీవు
ఎవరిని వరిమ్తువో అతడే నీ భర్త యగునట. ఈ సంగతి చెప్పి పోవుదామని నీ
దగ్గరకు వచ్చినాను. మన్మథునివంటి వానిని నీవు వరించెదవుగాని నావంటి వికృత
రూపముగల వానిని వరింతువా? సెలవిచ్చినచో పోయివత్తును" అనెను. ఉమ అతడు
చెప్పినది విని, "ఓ స్వామీ! నిన్ను శంకరునిగా గుర్తించితిని. నా పై నీకుగల
అనురాగామునకు సంతోషించితిని. నే నేవ్వరినో ఎందుకు వరించెదను? అనుచు ఒక పుష్పహారమును ఆ
నీలకంటుని మేడలో వేసెను. అతడు, "నన్ను ప్రీతితో వరించినావు గావున
నీకు ముసలితనమును, మరణము లేకుండా వారము నిచ్చుచున్నాను. నీవు తపస్సు
చేసిన ఈ వనము ఇంక చిత్రకూటవనమని పిలువబడును. ఈ వనమునకు, దేవతా పూజకై యెవడు పుష్పములు
గోయవచ్చునో అతడు అశ్వమేధ ఫలములను బొందును. ఎవడీ గిరి శిఖరమున తపము
చేయుచు ప్రాణములు విడుచునో అతడు ప్రమథగణములలో ముఖ్యుడగును"
అనెను.
No comments:
Post a Comment