Wednesday, August 21, 2013

బ్రహ్మపురాణము20




ఇంద్రద్యుమ్నుని పేరుతొ వెలసిన తీర్ధమే పంచతీర్ధమని పిలువబడును. ఈ తీర్ధమునందు నారాయణ నామస్మరణము చేయుచు అఘర్షణ స్నానముచేసి, బ్రహ్మయజ్ఞమును, దేవ పితృతర్పణములును జేయవలెను.ఆ పైన జగన్నాథుని పూజింపవలెను. అట్లుచేయు నరుడు పై యేడు తరములవారిని, తన తరువాత ఏడుతరముల వారిని తరింపజేయును. తానూ స్వయముగా విష్ణులోకమునకు దేవవిమానముపై వెళ్ళును. ఏకాదశినాడు ఉపవాసము చేసి ఆపైన చెప్పిన కృత్యములు నాచరించినను, జ్యేష్ట శుద్ధ పూర్ణిమా తిథియందు ఆచరిమ్చినాను విశేషమైన ఫలము గలుగును. జ్యేష్టశుద్ధ పూర్ణిమా తిథి, దశవిధ పాతకములను హరించును గనుక దానికి "దశహర" అని పేరు వచ్చెను. సమస్త తీర్ధ జలములను ఆ పంచతీర్ధమున నివశించును గావున జ్యేష్ట శుద్ధపూర్ణిమనాటి స్నానధ్యాన తర్పణాది కృత్యములు విశేష ఫలప్రదములని చెప్పబడెను. అట్లు పాపములను హరింపజేసుకొని తరువాత సుభద్రాబలరామ సహితుడైన జగన్నాథుని అర్చించినవాడు విష్ణులోకములను పొందును.

ఈ పురుషోత్తమ క్షేత్రమునకు సాటివచ్చునది మరియే క్షేత్రము లేదు. ఇతర క్షేత్ర మహిమలు దీనియందు పదునారవవంతు కూడా ఉండవు. "కలాంనార్హంతి షోడశీమ్". అశ్వములలోను నుచ్చైశ్శ్రవమును, మునులలో వ్యాసుడును, ఇంద్రియములలోమనస్సును, వర్ణములలో "అ" కారమును, చందస్సులలో గాయత్రియు, అంగములలో శిరస్సును, విద్యలయందు మోక్ష విద్యయు, దైత్యులందు ప్రహ్లాదుడును, ధాతువులలో బంగారమును, దేవర్షులలో నారదుడును, యజ్ఞములలో అశ్వమేథమును, మంత్ర ములందు ప్రణవమును ఎట్లు శ్రేష్ఠములయి యుండునో అట్లే పుణ్య క్షేత్రములందు ఈ పురుషోత్తమ క్షేత్రము సర్వ శ్రేష్టముగా నెంచబడును.

కుండు మహర్షి చరిత్ర
సూతుడు, పురుషోత్తమ క్షేత్ర మహత్మ్యమును జెప్పుచు నొక ఇతిహాసమును మునుల కిట్లు చెప్పెను.

కుండుడను మహర్షి ఒక అరణ్యమున తపము చేయుచుండెను. ఆయన వేదవేదంగ విశారదుడు. తన వద్దకు వచ్చినవారి శంశయములను నివారిమ్పగల పాండిత్యము గలవాడు. ఆయన, శరీరము క్షణ భంగురమని తెలిసిన వేదాంతి. అందుచే పురుషోత్తముడైన జగన్నాథుని మనసులో నిలిపి సమస్త ప్రపంచ విషయములను విడిచి తదేక నిష్టతో తపము చేయుచుండెను.


First    10  11  12  13  14  15  16  17  18  19  20  21   Last

No comments:

Post a Comment