దుష్టవర్తనము గలవాని ప్రక్క నివసింపరాదు. వైద్యుడు లేనిచోట, రాజు (పాలన) లేనిచోట, నదిలేని చోట, దుష్ట స్త్రీలున్నచోట నివసించరాదు. నవ్వినను, తుమ్మినను, ఆవులించినను నోటిని మూసికోనవలెను. తనకు గాని, తన యజమానికి గాని జరిగిన అవమానము చెప్పుకోరాదు. రోగమెంత చిన్నదైననూ నర్లక్ష్యము చేయరాదు. ప్రత్యక్షముగా గాని పరోక్షముగాగాని ఎవ్వరికిని అప్రియము పలుకరాదు. నిందింపకూడదు కూడ. వేదశాస్త్రములను, దేవతలను నిందించువారి ప్రక్కన గూడ నిలువరాదు.
ధర్మము నాదరించవలెను. దేవపూజలు చేయుచుండవలెను. పుట్టినరోజునాడు దేవపూజ చేసి దానధర్మమములు చేయవలెను. షష్టినాడు, చతుర్దశినాడు (నరకచతుర్దశి) తప్ప, అష్టమినాడు, అమావాస్య నాడు అభ్యంగన స్నానము చేయరాదు. పెద్దవారితో ఎప్పుడును విరోధము పెట్టుకొనరాదు. స్త్రీలతో గూడ కలహము పెట్టుకొనరాదు.
నవగ్రహ యజ్ఞము
ప్రజల యొక్కయు, రాజుల యొక్కయు పతనముగాని, ఔన్నత్యములు గాని, గౌరవా గౌరవములు గాని, గ్రహముల సంచారమువలనే ఏర్పడును గాన నవగ్రహములు నెప్పుడును ఆరాధింపవలెనని బ్రహ్మదేవుడు చెప్పెను. ఎప్పుడే గ్రహము వలన మనకు పీడా కలుగునో ఆ గ్రహమునకు శాంతి చేయవలెను.
సంపదలు, శాంతి, వర్షము, ఆయువు, అభివృద్ధి, ఆరోగ్యము కోరు ప్రజలు నవగ్రహ యజ్ఞము చేయవలెను.
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అని గ్రహములు తొమ్మిది.
వీరి బొమ్మలు (విగ్రహములు) చేసి, పూజింపవలెను.
No comments:
Post a Comment