Sunday, August 18, 2013

బ్రహ్మపురాణము18




అప్పుడు శ్రీనివాసుడు విశ్వకర్మను జూచి, "నీవు ఈ చెట్టుకొమ్మతో అపురూపమైన, విచిత్రమై శంఖ చక్ర గదాశార్ జ్గ ప్రముఖాయుధములతోను, సర్వాలంకారములతోను జగన్నాథుని ప్రతిమను నిర్మింపుము. దానితో పాటు బలరామమూర్తి విగ్రహమును నిర్మింపుము. హరికి సోదరియైన సుభద్రాదేవి విగ్రహమును గూడా తయారుచేయుము" అని చెప్పగా విశ్వకర్మ అందుకు అంగీకరించెను.

విశ్వకర్మ, రత్న కుండలములు, నీలాంబరము, ఒకచేత హలము(నాగలి)ను, రెండవ చేత గదయు, తెల్లని కాంతిగల శరీరమును గలిగిన బలరాముని విగ్రహము మొదట చెక్కెను.

రెండవ విగ్రహము శ్రీకృష్ణభగవానునిది. పీతాంబరము ధరించియున్నట్లును, శ్రీవత్సమును, శంఖచక్రములు ధరించినట్లును, పరమ సుందరమైన నేలమేఘచ్చాయ గల శరీరముతో ప్రకాశించున్నట్లును, ఆ ప్రతిమను విశ్వకర్మ మలచెను.

పద్మ పత్రముల వంటి నేత్రములు, చందమామవంటి మొగము, వివిధ వర్ణములతో నొప్పు పట్టుచీరయు, సర్వాలంకారములు శోభించునట్లుగా సుభద్ర విగ్రహమును గూడా చెక్కెను.

ఇంద్రద్యుమ్నుని బిలిచి, జగన్నాథుడు ఆ విగ్రహములను చూపించెను. సరిగా, అతడు మనసులో తలచుకొన్నట్లే ఆ విగ్రహములు మలచబడినవి. ఇంత స్వల్పకాలములో, ఇన్ని యలంకారములతో ఇంత సుందరమైన విగ్రహములను నిర్మించిన వారిరువురను జూచి, రాజు పరమాశ్చర్యభరితుడై ఇట్లనెను. "మహానుభావులారా! అద్భుతమైన తేజస్సుతోను రూపములతోను ప్రకాశించుచున్న మీరెవ్వరు? మాయారూపములలో వచ్చిన దేవతలనుకొందును. దయచేసి మీ వృత్తాంతములు తెలుపుడు"

అనగా విని జగన్నాథుడిట్లనెను. "సర్వ వేదాంత రహస్యములును జ్ఞానగమ్ముడని యెవని నందురో ఆ పరమేశ్వరుడను నేను. చరాచర విశ్వమంతయు నేనే. నీవు భక్తుడవు గనుక నీకు దర్శన మిచ్చినాను గాని, సామాన్యులకు కనిపించను. నీకొక వారము నిచ్చెదను కోరుకొనుము". రాజామాటలు విని బ్రహ్మానందమును పొంది సాష్టాంగ నమస్కారములు చేసి, "దేవా! ఆనంద స్వరూపమై పరమపావనమగు పరమపదమును నా కనుగ్రహింపుము" అని యడుగగా జగన్నాథుడు, " ఇంద్రద్యుమ్నా! నీవు అనేక యజ్ఞయాగాదులును పుణ్యకర్మలను చేయుచు ఈ భూచక్రమును పదివేలతొమ్మిది వందలయేండ్లు పరిపాలన చేయుదువు. నీవు చేసిన దానముల ధారలతో ఒకమడుగు ఏర్పడును. ఆ పిమ్మట నీవు దేవేంద్రులకు గూడా పొంద శక్యముగాని పరమపదమును పొందెదవు. ఇక్కడికి నైరుతి దిశగా నొక మర్రి చెట్టున్నది. దాని సమీపమున ఒక మండపము (దేవాలయము) గలదు. అది సమస్త పుష్పఫల వ్రుక్షములతోను అలరారుచుండును.


First    10  11  12  13  14  15  16  17  18  19  20  21   Last

No comments:

Post a Comment