ఆ వటవృక్షమునకు ఉత్తర భాగమునందు ఒక
మందిరము ఉన్నది. అందులో నొక అందమైన విగ్రహమును పరమేశ్వరుడు
స్థాపించెను. దానిని దర్శించిన నరులకు శోక మోహములు తొలగి వైకుంట ప్రాప్తి కలుగును.
ఒకప్పుడు యమధర్మరాజు పురుషోత్తమ
క్షేత్రమునకు వచ్చి, నాకు (శ్రీ మన్నారాయణునకు) నమస్కరించి, " నానారూపకుడవై జ్యోతి స్వరూపుడవైన
ఓ మహానుభావా! నీకు వందనములు" అని వినయముతో
పలుకగా, నేనిట్లు అడిగితిని. "యమధర్మరాజా! దేవతలలో ఉత్తముడవు. ధర్మమూర్తివి. ఇట్లు
నా దగ్గరకు వచ్చినావేమని " ప్రశ్నిం చితిని. అప్పుడతడు, "ఈ పురుషోత్తమ క్షేత్రములో
ఇంద్రనీలమణి రూపమైన నీ రూపము భక్తులకు కోరిన
కోరికలిచ్చుచున్నది. వారు నిన్ను దర్శించి, శాశ్వతమగు పేరుగల ఆ భవనము (దేవాలయము)ణు జూచి, కామక్రోధాదులు విడిచి
పుణ్యాత్ములై వైకుంటమునకు తిన్నగా
బోవుచున్నారు. నావైపు కూడా చూచుటలేదు. నా కసలు పనిలేకయున్నది. జీవుల
పాపపుణ్యములు విచారించుట తప్ప ఇంకేమి చేయజాలము. నన్ననుగ్రహించి యీ విగ్రహమును
పాపులకు కనబడకుండా జేయుము" అనికోరగా నేను, ఆ విగ్రహమును మునిజనులకు మాత్రమె
చూచుటకు వీలుగాను, ఇతరులకు వీలులేకుండగాను ఇసుకలో పెట్టి పూడ్చి పెట్టితిని.
యముడు సంతోషపడి వెడలిపోయెను.
మాళవదేశాధిపతి ఇంద్రద్యుమ్నుడు, అవంతీ నగరమును రాజధానిగా జేసుకొని
రాజ్యము పాలించుచుండెను. అతడు విష్ణుభక్తుడు. రాజ్యము నందలి ప్రజలను
కన్నబిడ్డలుగా జూచుచుండెడివాడు. వర్ణాశ్రమాచార
ధర్మములాతని పాలనలో తూచా తప్పక నడుచుచుండెడివి. అక్కడ నిత్యమూ
వేదశాస్త్ర ధ్వనులే వినబడుచుండెడివి. పాపాత్ములుగాని, మూర్ఖులుగాని ఆపురమునందు కనబడరు.
ఉజ్జయినీ నగరమున మహాకాళుడను పేరుతొ పరమేశ్వరుడు
ఆరాధింపబడుచు పాపములు పోగొట్టుచుండును.
ఇంద్రద్యుమ్నుడు ఒకనాడు పూర్వసముద్ర తీరమున నున్న
జగన్నాథుని చూచుటకు పురుషోత్తమక్షేత్రమునకు వచ్చెను.
అక్కడ జగన్నాథునకు ఆలయమును నిర్మింప దలచెను. ముందుగా వటవృక్షరూపుడైన
జగన్నాథునకు రాజోచితముగా షోడశోపచారములు చేసి, కాలింగ దేశాధిపతిని, కోసలరాజును పిలిపించి, "మనము శ్రీ జగన్నాథుని విగ్రహమును చేయించి, ఆపైన ఆలయమును నిర్మింతుము"
అని ఒడంబరచి ఆగమశాస్త్ర పండితులను శిల్పులను రావించి, "ఇక్కడ జగన్నాథునకు ఆలయమును
నిర్మించవలెను. మీరెల్లరును దేశమంతయు తిరిగి
అవసరమైన మేలైన రాళ్ళను ఎంపికచేసి తీసుకొనిరండు" అని వారిని
పంపి, వార్తాహరులను బిలిచి, "మీరు రాజులందరి యొద్దకు బోయి ఆలయ నిర్మాణమును
గూర్చిచెప్పి, యీ కార్యమున సహాయము చేయుటకై వారి నందరను ఇచ్చటికి రావలసినదిగా
చెప్పుడని" పంపించెను.
ఆ రాజులందరు వార్త యందినదే తడవుగా
సమస్త రాజలాంఛనములతోను, చతురంగబలములతోను పురుషోత్తమక్షేత్రమునకు వచ్చిరి.
వారందరిని జూచి ఇంద్ర జ్యుమ్నుడు ఆనందించి, యిట్లు అనెను. "ఈ క్షేత్రము
చాలా పుణ్యప్రదమైనది. అందుచేత ఇక్కడ జగన్నాథునకు ఆలయనిర్మాణము
చేయవలెను. అంతకు ముందే, అశ్వమేధ యాగము చేయవలెనని సంకల్పించితిని. ఇంత కార్య
భారమునే నొక్కడనే నిర్వహించుట కష్టము కావున మీరందరును నాకు సహకరించి పనిని
నిర్వహింపుడు".
No comments:
Post a Comment