Wednesday, August 28, 2013

బ్రహ్మపురాణము24




ఇట్లు గర్భము ఉత్పత్తియై వృద్ధి నొందుచుండగా పరమాత్ముని ఆదేశము వలన వాయువు అందులో ప్రవేశించును. ఆ వాయువు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానలని అయిదు విభాగములుగా శరీరములో ఉండును. అందులో ప్రాణవాయువు జీవాత్మను వృద్ధి నొందించు చుండును. అపానము శరీరములో పశ్చిమభాగము (గుదస్థానము) నాశ్రయించి యుండును. ఉదనాము కంట ప్రదేశమున నుండి దేహములో సగము భాగమును పెంచుట కుపయోగించును. వ్యానము శరీరమంతట వ్యాపించి యుండును. సమానము ర్వనాదులు ఏర్పడునట్లు చూచుచుండును. ప్రుథివ్యాపస్తేజో వాయురాకాశాములనెడి పంచభూతములును శరీరమందు తమతమ స్థానములలో నిలిచి యుండును. శరీరము పృథివీతత్త్వము గలది. ప్రానములే వాయువులు. నవరంధ్రములును ఆకాశభాగములు. శరీరమునుండి స్రవించెడి వన్నియును జలస్వరూపములు. జ్యోతిస్సు లేదా తేజస్సు అనునది నేత్రాత్మకము. మనస్సు సమస్తేంద్రియములను నడుపుచుండును. ఏ మనశక్తికి సర్వవిషయములును గోచరించునో అది ప్రథానమనుటలో ఆశ్చర్యమేమి కలదు? ఇట్లు పరమపురుషుడు లోకమునందు జీవసృష్టి చేయును. కానీ యీ లోకమునందలి జీవజాలమంతయు మృతినొందు స్వభావము గలది. ఏది ఇచట పుట్టునో అది కొంతకాలమునకు మృతి నొందక తప్పదు.

శ్రీకృష్ణ చరిత్రము
ద్వాపర యుగమునందు కాలనేమి మున్నగు చాలామంది రాక్షసులు భూమిమీద రాజులై పుట్టిరి. వారు ధర్మమను పేరుతో అధర్మము లాచరించుచు ప్రజాపాలనకు మారు ప్రజాపీడ చేయుచుండిరి. ఇది భరింపలేక భూదేవి ఒకప్పుడు బ్రహ్మదగ్గరకు బోయి "నేనీ దుష్టులవల్ల గలిగిన భారము భరింపలేకున్నాను. దీనికేదైనా ఉపాయము చెప్పవలె" అని యడుగగా బ్రహ్మ భూదేవితోను, దేవతా గణములతోను శ్రీహరి యొద్దకు పోయెను. భూదేవి అతనికి తన కష్టములను చెప్పుకొనెను. శ్రీమన్నారాయణుడు, భూమిని ఓదార్చి, తన తలలోని రెండు కేశములను లాగి " యీ రెండు బలరామ, కృష్ణులుగా  అవతరించి భూభారమును మాన్పునని" చెప్పెను.

శ్రీహరి మాయాదేవిని బిలిచి, "ఓదేవీ! హిరణ్యకశిపుని కుమారులు, ప్రహ్లాదుని తరువాత బుట్టినవారు ఆరుగురు ఆనాడు నాయాజ్ఞ చే పాతాళమునకు బోయిరి. వారిని దేవకీదేవి తొలిఆరు గర్భములలో నుంచుము. వారు కంసునికి బలియయ్యెదరు. ఏడవ గర్భమున అనంతుడామె గర్భమున ప్రవేశించును. నీవా గర్భము నాకర్షించి నందుని యింటనున్న, వాసుదేవుని భార్యయైన రోహిణి గర్భమున ప్రవేశపెట్టుము. దేవకి ఏడవగర్భము వ్యర్ధమయ్యెనని అందరును అనుకొందురు. తరువాత ఎనిమిదవ గర్భమున దేవకికి నే నుదయించెదను. నీవు యశోదాదేవి గర్భమున బుట్టి, రేపల్లెలోని వారందరనూ నీమాయలో ముంచివేయుము. వాసుదేవుడు నన్ను దెచ్చి నీ స్థానమున నుంచి, నిన్ను దేవకి దగ్గరకు దెచ్చును. సంసుడు వధించుటకు వచ్చినపుడు నీవతని చేతికి దొరకకుండా పోయి భూమియందు గ్రామదేవతా రూపములతో పూజింపబడుచుండును". అని పంపగా ఆమె అట్లేయని తన పనిమీద వెళ్ళెను.


First   20  21  22  23  24 25 26 27 28 29 30 Last

No comments:

Post a Comment