Wednesday, August 14, 2013

శ్రీ దేవీ భాగవతము6




అక్కడ ఏడామడల విస్తీర్ణముతో ఇనుపకోట యొకటి కలదు. దాని ద్వారములందును ఋరుజులందును చాలామంది భటులు కావలి యుందురు. దేవీ దర్శనమునకు వెళ్ళిన దేవతలు అక్కడ వేచి యుందురు. రత్న వృక్షములతో నిండిన తోటలు కన్నుల పండువు చేయును.

ఆపైన ఆకాశము నంటు కంచుకోట యున్నది. ఇది ఇనుపకోట కన్నా నూరురెట్లు కాంతి కలది. అక్కడ నున్న తోటలు చూడముచ్చటగా నుండును.

దీనికావల రాగికోట యున్నది. ఈ ప్రాకారములోపల కల్పవృక్షము లున్నవి. పండ్లలోని బీజములు రత్నములే. వాని సువాసనలు చాల దూరముదాకా వ్యాపించును. ఆ వనములో వసంతుడు మధుశ్రీ మాధవశ్రీ యను భార్యలతో నివసించును. గంధర్వుల గానములు చెవుల కింపుగా నుండును.

ఆ పైన సీసపు కోట గలదు. (ప్రాకారమునే కోటలందురు) దీని యందు సంతాన వృక్షము లుండును. శుక్లశ్రీ శుచిశ్రీ అను భార్యలతో ఇక్కడ గ్రీష్మర్తు రాజుండును.

దానిలోపల ఇత్తడి కోట యున్నది. దేనిలో హరిచందన వనమున్నది. నభశ్రీ  మున్నగు పండ్రెండుగురు భార్యలతో వర్షర్తు రాజిక్కడ నివసించును. నదీనదము లెక్కువ యుండును. చెట్లు, లతలు పచ్చగా శోభించును.  ఆపైన పంచలోహమయమైన కోటగలదు. మందార వృక్షము లిక్కడ నుండును. ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అను భార్యలతో శరదృతురాజిక్కడ విహరించుచుండును.

ఆ మీద వెండి కోట యున్నది. ఇక్కడ పారిజాతవన మున్నది. ఆ పూలవాసన పది యోజనముల వరకు వ్యాపించును. సహశ్రీ, సహస్యశ్రీ అను భార్యలతో హేమంతఋతు రాజిక్కడ నివసించును.

దానికావల బంగారు కోట గలదు. అక్కడ కదంబ (కడిమి) వృక్షములు గలవు. సిద్ధుల కది నివాసము. తపఃశ్రీ పస్యశ్రీ అను భార్యలతో శిశిర ర్తురాజు ఆవనములో నివసించును.

ఆపైన పుష్యరాగ ప్రకార మున్నది. ఆ ప్రాంత మంతయు పుష్య రాగమయమే. కాంతితో మెరయు చుండును. ఇక్కడ అష్టదిక్కులందును దిక్పాలకులు నివసింతురు.

ఆమీద కుంకుమారుణమైన పద్మరాగ ప్రాకారము గలదు. ఇక్కడ అంతయు పద్మరాగ మణిమయమే. పింగాక్షి మున్నగు నమాములు గల చతుష్పష్టి యోగినీ గానము లుందురు. అందు ఒకొక్క శక్తి లక్ష బ్రహ్మాండములను త్రుటిలో నశింపజేయగలదు.


No comments:

Post a Comment