అతని తపః ప్రభావమునకు దేవేంద్రుడు
భయపడి దానిని చెరుప నుద్దేశించి ప్రమ్లోచన యను అప్సరసను బిలిచి, "నీవు వెళ్లి ఆ కుండుముని తపమును
పాడుచేసి రావలెను" అనగా ఆమె ముని శపించునేమో యని
భయపడి "మహేంద్రా! రంభాద్యప్సరసలు నాకంటే సౌందర్యవతులున్నారు. వారిని
పంపవచ్చును గదా! నే నెంత? నా సౌందర్యమెంత?" అనగా ఇంద్రుడు "నీ వల్లనే ఈ
కార్యము కొనసాగవలెను. నీకు మన్మథుని, వసంతుని సహాయముగా పంపుచున్నాను. వెళ్లి
పని సాధించుకొని రమ్ము". అని పంపగా నామె కుండుముని తపోవనమునకు వెళ్ళెను.
అతని తపః ప్రభావముచేత ఆ వనమున గల జంతువులన్నియు పరస్పర మైత్రితో
నుండెను. వృక్షములు ఫలపుష్ప సంభరితములై కనుల పండువుగా నుండెను.
అక్కడికి వచ్చిన ప్రమ్లోచన ఆవన
సౌందర్యమునకు ముగ్దురాలయ్యెను. అది ప్రభాత సమయము. ప్రక్రుతి మనోహరముగా నున్నది. ఆ
సమయమున ఆమె ఒకపూలచెట్టు క్రింద కూర్చుండి లోకములు పరవశించునట్లు గానము
చేయుచుండెను. మదన వసంతు లామెకు తోడుగా నుండిరి.
కుండుముని ప్రాతస్సంద్యా వందనమునకై లేచెను.
ఈ గానము శ్రుతి మనోహరముగా వినిపించెను. ముని ప్రమోచన వద్దకు వెళ్లి
"నీ వెవతెవు? నీవు వచ్చిన పనియేమి?" అని ప్రశ్నించెను. ఆమె "మునివరా!
నీసేవ చేసి తరించుటకై వచ్చినాను. నీ కెప్పుడేమి కావలెనో చెప్పినచో
అన్నియు సిద్ధముగా నమర్చియుంచెదను" అనెను. ఆ సమయమున మన్మథుడు పూలబాణముల నాముని
హృదయములో నాటవేసెను. వసంతుడు అతని పై పూలజల్లు కురిపించెను. క కోయిల
కూసినది. ఇకనేమి? ముని మనసు అప్సరసపై లగ్నమైనది. ముని ఆమె
చేయుపట్టుకొని తనభావమును తెలియజెప్పి, ఆమె నాశ్రమ కుటీరములోనికి తీసుకొని పోయెను.
తామువచ్చిన పని నెరవేరినందుకు సంతోషించి మదన వసంతులు స్వర్గలోకమునకు బోయి, యింద్రుని కావిషయము జెప్పిరి.
ఇంద్రుడు చాలా సంతోషించెను.
కండుముని ప్రమ్లోచనతో గూడి నూరు
సంవత్సరములు, ఇదిపగలు, ఇది రాత్రి అను భేదము తెలియకుండా భోగసాగరమున
తేలియాడుచుండెను. ముని వేషములో నున్నచో ఆమె తనను అసహ్యించుకొనునేమో ఈ తపశక్తిని
ఖర్చుపెట్టి పదియారేండ్లు నవయౌవన రూపము ధరించి ఆమెతో సుఖపడుచుండెను.
వందయేండ్లు గడచినా తరువాత ఆమె, "నేను స్వర్గ పట్టణమునకు పోవుదును
సెలవిమ్ము" అనెను. అతడు వెళ్ళవచ్చును లెమ్ము ఇంక
కొంత కాలముండు" అనెను. ఆమె మునికి ఎదురు చెప్పలేక ఉండిపోయెను. ముని తపస్సు
మాట మరచిపోయెను. దేవతారాధనములు, స్నానములు, సంధ్యలు, జపములు, వేదపారాయణలు అన్నియు మూలబడెను.
No comments:
Post a Comment