చక్రవర్తి తమ్ము అందరిలోన నిట్లు అడుగగా రాజులందరును
పరమానందమునొంది, అశ్వమేధ యాగమునకు గావలసిన సంభారము లన్నియు
సమకూర్చిరి. ధాన్యములు మున్నగు ఆహారపదార్దములు, రాజులు, వారి యంతఃపుర స్త్రీలు
నివసించుటకు యోగ్యమైన కుటీరములు, నేయి, సమిధలు, దర్భలు, మున్నగు హొమద్రవ్యములు, విశాలమైన యజ్ఞశాలలు, దానధర్మములుకు సరిపోవు గోవులు
మున్నగు యజ్ఞమున కవసరమైన సమస్త ద్రవ్యములు సమకూర్చబడెను. దూర
దేశముల నుండి వచ్చు బ్రాహ్మణులకును, రాజులకును నానాజాతులవారికిని
వారివారికి తగిన వసతులు ఏర్పరచబడెను. ఒక సుముహుర్తమునకు ఇంద్రద్యుమ్నుడు
యజ్ఞదీక్షితుడై యశ్వమును పూజించి దేశముమీదికి వదలెను. అతని
కుమారులు చాల పరాక్రమవంతులు. వారు అశ్వమును వెంటనంటి వెళ్ళిరి.
అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ, ఋత్విజులు ఎల్లరును
వేదమంత్రోచ్చారణము చేయుచు హొమములు చేయుచుండిరి. పండితులు
శాస్త్రచర్చలు చేయుచుండిరి. ఇట్లు మహావైభవముతో శాస్త్రచోదితమైన విధానములతో
యజ్ఞము సంపూర్తి యయ్యెను. చక్రవర్తి అవబృథ స్నానముచేసి నానాదేశములనుండి
వచ్చిన బ్రాహ్మణులను వస్త్ర మాల్యాదులతోను అపరిమిత ధనములతోను సత్కరించెను.
రాజులను యధోచితముగా గౌరవించెను. తానే ఆన్నింటిని పరిశీలించుచు అందరిని
సంతోషపరచెను. యాగము పరిసమాప్తమైనది.
ఇంద్రద్యుమ్నుడు డొకనాడేకాంతముగా గూర్చుండి
పుండరీకాక్షుడైన శ్రీ జగన్నాథుని మనసులో దలచుచు ఇట్లు స్తుతించెను. "ఓ
జగన్నాథా! నీవు సర్వత్ర వ్యాపించి యున్నవాడవు. ఈ సృష్టిలో ప్రతిఅణువు గూడ నీ
స్వరూపమే. నీ విన్ని భిన్నరూపములలో గనబడుచున్నను అద్వైతుడవే.
అజ్ఞానులమగు మావంటి మానవులకు ద్వైతుడవుగాను, అనేకుడవుగాను కనబడుచుందువు. నీ
మహిమను దేవతలే తెలిసికొనలేరు. మావంటి అల్పబుద్ధుల కెట్లు బోధపడును? నేను ఇదివరలో ఎన్నో జన్మము
లెత్తినాను. ఎన్నో స్వభావములు ప్రవర్తించినాను. మానవ
పశుపక్షిక్రిమి కీటకాదులలో ఎన్ని మాతృగర్భములలో పుట్టినానో
లెక్కలేదు. జన్మము లెత్తినా తరువాత ఎన్నో సుఖములను దుఃఖములను గూడ
అనుభవించితిని. మానవజన్మ మెత్తినపుడు ఎన్నో శాస్త్రములు చదివితిని, వేదములు చదివితిని. పురాణములు, నీటి శాస్త్రములు ఆభ్యసించితిని. ఎంతయో ధనము
నార్జించితిని. పుత్రా కళత్ర బంధు మిత్రాది పరివారములలో మసలి ఆనందించితిని.
వారిలో ఎవరైనా దూరమైనచో దుఃఖించితిని. జలయంత్రము (ఏతాము) వలె జీవితములో
ఎగుడుదిగుడులు చూచితిని. దారిద్ర్యములను అనుభవించితిని, ఇశ్వర్యములను అనుభవించితిని.
ఇటువంటి సంసార చక్రములోబడి దీని అంతయును జూడలేక
పరితపించుచున్నవాడను. నీవే కరుణించి నన్ను ఈ సంసార బంధవిముక్తుని జేయవలెను. నీ కన్నా
సమర్ధులు వేరెవ్వరును లేరు. నాయోగము (ఉన్నతస్థితి నొందుట), నా క్షేమము (ఆస్థితి చిరకాలము
నిలుచుట) నీ చేతిలోనిది. నిన్ను సేవింపని
మనుజులు అధములు. వారికి నీయందు భక్తి యెట్లు కలుగును? అందుచేత నేను ఎప్పుడే
జన్మమునెత్తినను నీ నామస్మరణమును, నీయందు ఆచంచలభక్తిని నాకు ప్రసాదింపుము.
ఐనను ఎవ్వరి కెట్టి ఫలములను, గతులను ఇవ్వవలయునో నీకు తెలిసియే
యుండును. ఇట్లడుగుట మావెర్రితనము. ఇవియే నీకు కోటి ప్రణామములు".
(ఈ స్తవ రాజము నెవ్వరు చదివినను
విన్నను ఐహికాముక్షిక సుఖములు గలుగును.)
No comments:
Post a Comment