Wednesday, August 21, 2013

బ్రహ్మపురాణము12




పార్వతి ఆ పర్వత శిఖరమునందే కూర్చుండి పరమేశ్వరుని ధ్యానించుచుండెను. ఆ పర్వత సమీపమున ఒక తామర చెరువు గలదు. ఒకనాడు శివుడు ఒక బాలకుని రూపముతో ఆ చెరువులోనికి దిగి జలక్రీడలు సలుపుచుండగా  అందున్న మొసలియొకటి అతనింబట్టుకొనెను. బాలుడు పెద్దగా ఏడ్చెను. అది విని పార్వతి ఆ కొలను యొద్దకు వెళ్లి చూచెను. "అయ్యో! ఈ మొసలి నన్ను పట్టుకొన్నది. ఎవరైనా పుణ్యాత్ములు వచ్చి నన్ను కాపాడరా? నెను నా తల్లి తండ్రులను గూర్చి విచారించుచున్నాను.

వారికి నే నోక్కడనే పుత్రుడను. నా మరణవార్త విని వారుకూడా మృతి నొందుదురు. దైవ నిర్ణయమును కాదన గలవారెవ్వరు?" అని విచారించుచుండెను.

పార్వతి, ఆ మొసలితో "ఓ నక్రమా! నీ వేల యీ బ్రాహ్మణవటువును మ్రింగుచున్నావు? కనికరించి విడిచి పెట్టుము" అనగా మోసలి "తల్లి! ఇచ్చటికి వచ్చిన ఏ ప్రాణి నైనను భక్షించి జీవనము గడుపుకొనుమని బ్రహ్మ నాకుచెప్పెను. ఈనాడు ఈ బాలుడు నాకు దొరికెను. ఎట్లు వదలగలను"? అనెను. పార్వతి యిట్లనెను. "ఓ జలచరమా! నేను హిమవంతుని పుత్రికను. ఈ గిరి శ్రుంగమున నేనిన్నాళ్ళు చేసిన తపము నీ కిచ్చెదను. ఈ బాలుని విడిచి పెట్టుము". ఆమాట విని మొసలి "నీవు ఉత్తమముగా భావించిన తపము కొంచమైనను అది నాకిమ్ము" అనగా పార్వతి, "నేనూ పుట్టినప్పటి నుండి ఏ పుణ్యములు చేసితినో ఆ పుణ్యములను వాని ఫలములను నీ కిచ్చుచున్నాను బాలుని విడువు మనెను". అందుకు మొసలి, "ఉమాదేవీ! ఇంత కష్టపడి చేసిన తపమును వదులు కొందువా? పెద్దలు విన్నచో నిన్నుమెచ్చరు. పోనిమ్ము నీ తపము తోపాటు ఈ కుమారుని గూడా నీకిచ్చెదను. తీసికొని పొమ్ము" అనగా పార్వతి, "అయ్యా, ఒక బ్రాహ్మణ బాలకుని రక్షించుట కంటే తాపమే ఎక్కువా? తపము కావలెనన్నచో మరల చేసికొనవచ్చును. రాజులకు బ్రాహ్మణ రక్షణము విహిత కార్యము కదా? అదియునుగాక, ఇచ్చిన దానిని గురించి ఆలోచించుటయు, తిరిగి పుచ్చుకొనుటయు, సజ్జన లక్షణము కాదు. ఇచ్చినది ఈశ్వరార్పణమే" అని పలుకగా ఆ నక్రము పార్వతీదేవిని అభినందించి తపసు వలన కలిగిన తేజముతో తన స్థానమునకు బోయెను. ఆ బాలకుడు వెంటనే అంతర్ధానము నొందెను. పార్వతి తిరిగి ఘోరతపముచేయ నారంభించెను. పరమేశ్వరుడు ప్రత్యక్షమై "అపర్ణా! నీవు తపః ఫలమును ధారపోయగా దానినంతను నేను గ్రహించితిని. అది నీకు అక్షయమగు ఫలము నిచ్చును. ఇంక తపము మానుము" అని పలుకగా పార్వతి తన తపము ఫలించినందుకు అమితానందము పొందెను. పర్ణమనగా ఆకు, తపము చేయువారు ఆకులు అలములు తిందురు. ఈమె తపము చేయునప్పుడు ఆకులు కూడా తినక ఉపవాసముతో నుండెను. మునులీమెను "అపర్ణ" యనిరి.


First    10  11  12  13  14  15  16  17  18  19  20  21   Last

No comments:

Post a Comment