జైమిని పాతివ్రత్య మహిమ యెట్టిదో వివరించి చెప్పుడనగా పక్షులిట్లు చెప్పెను.
సుమతి కధ
పూర్వము ప్రతిష్ఠాన పురములో కౌశికుడను బ్రాహ్మనుడు ఉండెడివాడు.అతనియ దృష్టము కొలది సుమతి అనునది భార్యగా లభించినది. వాడెంత కోపిష్టి వాడో ఆమె అంత శాంత స్వభావము కలది. వాడెంత తిరుగుబోతో ఆమె అంత మహా పతివ్రత. వాడు చెడు తిరుగుళ్ళు తిరిగి కుష్ఠురోగము దెచ్చుకొనెను. అయినను సుమతి అతనిని దైవమువలెనే సేవించు చుండెడిది.
ఇట్లుండగా కౌశికు డొకనాడు ఒక వేశ్యాకాంతను చూచెను. ఆమె దగ్గరకు తనను తీసికొనిపొమ్మని భార్యను వేధించెను. ఆమె వేశ్య నొప్పించి వచ్చెను. భర్తను భుజాల పై కూర్చుండ బెట్టుకొని వేశ్యయింటికి తీసికొని పోవుచుండగా అతనికాలు ఆ చీకటిలో నొకనికి తగిలెను. అతడు మాండవ్యముని. అతడు చిన్నప్పుడు తూనీగలను పుల్లకు గ్రుచ్చి చంపెడి వాడట. రాజదండన పొందినవానికి యమదండన ఉండదుగదా! రాజును అతడు, తనకు శిక్ష విధింపుమని కోరగా రాజు అతనిని కొఱత వేయించెను. ఈ కౌశికుని కాలు ఆ కొఱ్ఱుమీద నున్న మాండవ్యునికి తగిలెను. అతడు"నన్ను బాదించిన నీ శిరస్సు సూర్యోదయము అగు సరికి వేయి చెక్కలగుగాక" అని శపించెను. సుమతి అతని శాపము విని, నా భర్త చనిపోవునన్నచో అసలు సూర్యోదయమే కాకూడదని శపించెను. ఆమె అన్నట్లుగానే సూర్యోదయము కాకుండ ఆగిపోయెను. లోకములన్నియు తలక్రిందులైనవి. అపుడు బ్రహ్మాది దేవత లందరును వచ్చి, "తల్లీ! సూర్యోదయము కానిచో లోకములన్నియు తల్లడిల్లు చున్నవి. నీ భర్త చనిపోయినచో మేము వానిని బ్రతికించి ఆరోగ్యవంతుని, సుగుణవంతుని చేసెద మని" చెప్పగా ఆమె శాపమును ఉపసంహరించి సూర్యోదయమునకు అనుమతించినది. సూర్యోదయము కాగానే కౌశికుడు మరణించెను. వెంటనే అనసూయ అతనిని పునర్జివితుని చేసెను. అతడు నవ మన్మధాకారు డై భార్యతో గూడి బ్రహ్మదులను స్తుతించెను. పాతివ్రత్యము అంత శక్తి వంతమైనది.
No comments:
Post a Comment