కుమార స్వామి జననము
ఒక సమయమున దేవత లందరును సభ తీర్చియుండగా పార్వతి అక్కడికి వచ్చి విష్ణుమూర్తికి నమస్కరించి "మహానుభావా ! నీవు సర్వ జగత్తులకును రక్షకుడవు గావున అడుగుచున్నాను .నర్మదా నదీ తీరాణ్యములో పార్వతీ పరమేశ్వరులము మేము విహరించు సమయములో దేవతలు మా ఏకాంతమును భగ్నము చేసిరి.
అపుడు పరమేశ్వరుని తేజము భూమిపై జారినది .దాని నెవ్వరు హరించినారు ? అదేమైనది ? దేవతలందరును ఇక్కడే ఉన్నారు గదా ! దానికై అన్వేషింపుడు " అని కోరెను. విష్ణువు సభలోని దేవతలను జూచి ,"పార్వతి మాటలు మీరందరును విన్నారు గదా ! ఆ శివ తేజమును తీసిరో వారు దానినీ సభకు తీసికొని రండు .లేనిచో దండనము విధింపబడును "అని పలుకగా ,బ్రహ్మ, శివుడు ,యముడు, ఇంద్రుడు , వరుణుడు ,కుబేరుడు ,ఏకాదశ రుద్రులు, కామదేవుడు ,సర్వదేవతలు అందరును మే మెరుగ మనుచు ప్రమాణములు చేసిరి .అది చూచి విష్ణువు ,త్రిలోక వాసుల కర్మములకు సాక్షీ భూతులైన ధర్మ, సూర్య ,చంద్ర, అగ్ని, వాయు ,భూమి, జల, సంధ్యా ,రాత్రింది వములను జూచి ,యీ శివ తేజము నెవ్వరేమి చేసినది మీకు తప్పక తెలిసి యుండ వలెను. మీరు సర్వ కర్మ సాక్షులు గదా ! అనగా , ధర్ముడు "శివ వీర్యము భూమిపై బడినది అంతవరకు నేను ఎరుగుదును "అనెను .భూదేవి " అబలను నన్ను క్షమింప వలెను . దానిని నేను భరించలేక అగ్నిలో విడిచితిని." అనెను. అగ్ని "నేనును బలహీనుడనే ఆ తేజమును నేను భరించలేక రెల్లు దుబ్బులలో విడిచితిని " అనెను .వాయువిట్లనెను. " సువర్ణ ముఖీ (స్వర్ణ రేఖా ) నదీ తీరములో ఆ తేజము నుండి ఒక అందమైన బాలుడు పుట్టెను. ." సూర్యుడు వెంటనే " సాయంకాల సమయమున పుట్టి యేడ్చుచున్న ఆ బాలుని నేనును గూడా చూచితిని . అయితే ,సాయంవేళ అస్తమించక తప్పాడు కదా ! అందుచేత వెడలి పోయితిని " అనెను .ఆపైన చంద్రుడు లేచి "మహాప్రభో ! ఆ బాలుని నేను చూచు చుండగనే కృత్తికా గణము అని పిలవబడు ముని కన్యకలు తీసికొని పోయి బదరికాశ్రమమునకు చేర్చిరి "అనెను .జలదేవత లేచి "షట్క్రుత్తికలు ఆకలితో ఏడ్చుచున్న బాలునికి చనుబాలిచ్చి పెంచినారు ." అని చెప్పెను. సాయం ప్రాత స్సంధ్యలు లేచి "వారా బాలునికి కార్తికేయుడని పేరు పెట్టి పెంచు చన్నా "రని చెప్పెను. రాత్రి లేచి "వారు ఆ బాలుని ప్రేమతో పెంచు చున్నారు .వాడొక్క క్షణము కనబడనిచో వారు తల్లడిల్లి పోవుచున్నారు " అని పలికెను . పగలు లేచి ," కృత్తికలు ఆ పిల్లవానికి లోకములో ని ప్రశస్తమైన పదార్ధములను తిని పించుచు పెంచుచున్నారని " చెప్పెను.
No comments:
Post a Comment