Thursday, March 13, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము11




వాత పిత్త శ్లేష్మ ప్రకోపములు
ఆకలి వేయుచున్నను అన్నము తినక పోవుటవలన (పిత్త ) పైత్యము ప్రకోపించను .తాటిపండు ,మారేడు పండు తిని నీళ్ళు త్రాగుట ,భాద్రపద మాసములో వేడి నీళ్ళు తలపై పోసికొనుట ,చేదు పదార్దములు అనగా కాకరకాయ వంటివి తినుట వలన పైత్యము వృద్దియగును.
ధనియాల చూర్ణమును పంచదారను చల్లని నీళ్ళలో గలిపి త్రాగినచో పైత్యము తగ్గును . పెరుగు తప్ప మిగిలిన పంచ గవ్యమును ,సెనగ పప్పుతో చేసిన పదార్ధములును ,బాగుగా పండిన తాటి -మారేడు పండ్లను ,అల్లము ,పెసలు కడిగిన నీరు
, పంచదార తో చేసిన చిమ్మిలి (తిల పిష్టము ) ఇవి పైత్యమును బోగొట్టి బలమును వృద్ది చేయును.
భోజనమైన వెంటనే స్నానము చేయుట ,దాహము కాకుండ నీరు  త్రాగుట , నువ్వుల నూనె ,చలిది యన్నము ,పెరుగు ,అరటిపండు ,పంచదార నీళ్ళు ,వర్షపు నీరు ,కొబ్బరి నీళ్ళు ,నిలువయున్న నీళ్ళతో స్నానము ,వర్షము కురియుచుండగా చెరువులో గాని నదిలో గాని స్నానము ,ముల్లంగి దుంప వీనివలన శ్లేష్మము వృద్ది యగును. దోసకాయ గూడ శ్లేష్మ వృద్ది యగును.
నేతితో గలిపిన గోరోజన చూర్ణమును ,నేతితో కలిపిన పంచదార ,మిరియాలు ,పిప్పళ్ళు ,శొంటి ,జీలకర్ర ,తేనె , పచ్చి అరటికాయ ,చిత్రమూలము ,కరకకాయ ,వావిలియాకు ,ఇటువంటి ద్రవ్యములు శ్లేష్మమును హరించును.
భోజనమైన వెంటనే నడక - లేక పరుగు పెట్టుట ,తన కంటే పెద్దదైన స్త్రీతో సంపర్కము ,మనస్సంతాపము ,తిండి లేకుండా నుండుట ,కలహము ,భయము ,శోకము ఇవి వాతము వృద్ది యగుటకు కారణములు.
పండిన యరటి పండును ,మాదీఫల రసముతో గూడిన పంచదార నీళ్ళు ,లేత కొబ్బరి నీళ్ళు ,బాగుగా చిలికిన మజ్జిగ ,గేదె పెరుగు ,తరవాణి ,రేగుపండు ,కేవలము నువ్వులతో ఆడిన నూనె ,తాటిపండు ,ఖర్జూర ఫలము ,పెద్ద ఉసిరికాయ రసము, 
గోరువెచ్చని నీటితో స్నానము , మంచి గంధపు పూత ,ఇవియన్నియు వాత దోషమును హరించును .
విప్రబాలకు డీ విషయము లన్నియును చెప్పి " నీ భర్తయే రోగముతో మరణించి నాడో చెప్పు " మని మాలావతి నడిగెను . ఆమె " యోగ శక్తి చేత ప్రాణము విడిచినాడ "ని చెప్పి ,తన భర్తను బ్రతికించమని కోరెను .అతడు దేవసభకు పోయి దేవతలతో మాటలాడి మరొక వేయి యేండ్లు ,ఉపబర్హణుడు జీవించు నట్లు చేసెను .మాలావతి సంతోషించెను .ఆ తరువాత వేయి యేండ్లు ఉపబర్హణుడు జీవించి యోగ శక్తిచే శరీరము విడిచెను .మాలావతి గూడ తన పాతివ్రత్య యోగముచే గంగా తీరమున శరీరము విడిచెను .
ఉపబర్హణుడు (నారదుడు ) తరువాతి జన్మములో శూద్ర స్త్రీ కడుపున బుట్టెను. ఎట్లనగా -ద్రమిళుడను గోపకుడు ఉండెను . అతని భార్య గోపిక వారికి సంతతి లేక నారదుడను ఋషి యనుగ్రమున ఒక బాలకుని పొందిరి. గోపకుడు చనిపోగా గోపిక నొక బ్రాహ్మణుడు రక్షించెను . ఆమెకు బ్రహ్మ తేజస్సు గల కుమారుడు జనించెను .అతడు చిన్ననాటి నుండి విష్ణు భక్తుడై యుండెను. అతని యైదేండ్ల వయసులో బ్రాహ్మణుని యింటికి నలుగురు విప్ర బాలకులు వచ్చిరి .వారిలో చివరివాడు ఈ బాలుని జూచి శ్రీ కృష్ణ మంత్రము ఉపదేశించెను .యీతడు హిమాలయములకు బోయి వేయి యేండ్లు తపము చేసెను . మురళీ కృష్ణుడు అతని యెదుట ఒక్క నిమిషము సాక్షాత్కరించెను . శ్రీ కృష్ణుడు అదృశ్యుడు కాగానే ఇతడేడువ సాగెను .ఆకాశవాణి " నీ వీ దేహము విడిచిన తరువాత ఆ భగవానుని నిత్యము చూడగలవు " అని చెప్పగా అతడా దేహము విడిచి బ్రహ్మలో లీనమయ్యెను . కొంత కాలమునకు మరల బ్రహ్మ కంటము నుండి నారదుడు జన్మించి వీణా పాణియై హరిని స్తుతించు చుండెను. ఇట్లు బ్రహ్మ శాపము వలన నారదుడు రెండు జన్మము లెత్తి ,మహావిష్ణు భక్తుడై మరల బ్రహ్మ కంటము నుండి జన్మించి శ్రీకృష్ణ సంకీర్తనము చేయుచు అతని యనుగ్రమునకు పాత్రుడయ్యెను .
తండ్రి మాటను దిక్కరించుట చేత గదా ,బ్రహ్మ మానస పుత్రు డంతటి వాడు రెండు జన్మము లెత్తి ,గర్భ నరకముల ననుభవించి జనన మరణములకు గురి యయ్యెను ?


 First  2  3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17  Last

No comments:

Post a Comment