Thursday, March 20, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము26





గణేశునికి గజ ముఖము వచ్చుట
తన కుమారుడు గణేశుని వికలాంగునిగా శపించి నాడను కోపముతో శివుడు సూర్యుని తన శూలముతో ఎనిమిది పోట్లు పొడిచెను .సూర్యుడు స్పృహ తప్పి పడిపోయెను .అది చూసి అతని తండ్రియైన కశ్యపుడు దుఃఖించి ,శివుని జూచి " నాపుత్రునిట్లు పొడిచి చంపినావు గావున నీ కొడుకు తల కూడా తెగి పడును గాక " అని శపించెను .తరువాత తన యోగ శక్తిచేత సూర్యుని బ్రతికించెను .సూర్యుడు లేచి తండ్రికిని శివునికిని నమస్కరించి ,తండ్రితో "నాయనా ! నీవు అనవసరముగా దేవ దేవుడైన శివుని శపించితివి .ఇట్లు జరుగుటకు కారణము శ్రీకృష్ణుని విలాసము " అనుచుండగా బ్రహ్మ అక్కడికి వచ్చి వారిని సమాధాన పరచి వెడలి పోయెను.
ఇది ఇట్లుండగా ,ఒకనాడు ఇంద్రుడు పుష్ప భద్రానదికి వెళ్లి స్నాన ధ్యానములు చేసికొని వన విహారము చేయుచుండగా అక్కడికి అప్సర స్త్రీలతో అగ్ర గణ్యురాలను, మహా సౌందర్య వతియైన రంభ వచ్చెను. దానిని జూచి ఇంద్రుడు మోహ పరవశుడై ,ఆమెకు తన కోరికను తెలియ పరచెను. ఆమెయు ఇంద్రుని జూచి ఆకర్షితు రాలయ్యెను. వారిరువురును ఆ నిర్జనమైన యరణ్యములో ఇతర ప్రపంచమును మరచి కొంతకాలము భోగములలో మునిగిపోయిరి .ఒకనాడు ఇంద్రుడు రంభ తో పుష్ప భద్రా నదిలో స్నానమాడు చుండగా మహాతీవ్ర కోపియైన దుర్వాసుడను ముని కైలాసమునకు బోవుచు అచటికి వచ్చెను. అతని చేతిలో ఒక మందార మాల యుండెను. ఇంద్రుడు మునిని జూచి నమస్కరించెను.దుర్వాసుడు తన చేతిలోని మాలికను ఇంద్రునికిచ్చును . "ఇది శ్రీ కృష్ణునికి పూజ చేసి తెచ్చిన నిర్మాల్యము దీనిని శిరస్సున ధరింపవలెను .అలక్ష్యము చేసినచో లక్ష్మీదేవి ఇంటి నుండి తొలగి పోవును సుమా !" అని హెచ్చ రించెను . రంభతో నుండి మదోన్మత్తుడైన ఇంద్రుడు ఆ మాట సరిగా వినిపించు కొనక తన సమీపముననే యున్న ఐరావతమునకు ఇచ్చెను .దాని నది తొండముతో పట్టుకుని ఒక ఆడు ఏనుగు (కరిణి) కొరకై వెదకుచు ఎక్కడికో పోయెను. రంభ సంపదలు పోగొట్టుకున్న యింద్రుని విడిచి పోయెను . ఐరావతము ఒక కరిణి ని జూచి దానితో భోగముల నుభవించుచు నొక ఏనుగు పిల్లను , మంచి తేజస్సుతో లక్ష్మీ కళతో ప్రకాశించు దానిని గనెను .ఆ ఏనుగు పిల్లకు అంత శోభ వచ్చుటకు మందార మాలయే కారణము . దాని ప్రభావముచే పుట్టినది కనుకనే ,పెద్దదైన తరువాత ,ఉత్తర దిశగా తల పెట్టి పండుకొని యుండగా దాని శిరస్సును ఖండించి గణేశుని మొండెమునకు శ్రీకృష్ణ భగవానుడు అతికించి ప్రాణ ప్రతిష్ట చేసెను .


 First   16 17 18 19  20  21  22  23  24  25  26  27  28  29  30  31 Last

No comments:

Post a Comment