Thursday, March 13, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము6






చంద్రుడు
శ్రీ కృష్ణుని మనస్సు నుండి పుట్టిన చంద్రునికి (" చంద్రమా మనసో జాతః " అని శృతి కూడ) దక్షుడు అశ్వినీ భరణ్యాదులు ఇరువది ఏడుగురు కుమార్తెల నిచ్చి పెండ్లి చేసెను. వారిలో రోహిణి యనిన చంద్రునకు చాలా ఇష్టము .ఆమెతో నుండి మిగిలన భార్యలను అలక్ష్యము చేసెడి వాడు . ఇది వారికి చాలా బాధ కలిగించెను. తండ్రియగు దక్షుని వద్దకు పోయి వారు చంద్రుని సంగతి చెప్పిరి .అతడు ముందు వెనుక లాలోచింపక చంద్రునికి క్షయ రోగము గలుగునట్లు శపించెను. చంద్రుడు ఆ రోగముచే నానాటికి క్షీణిం చుచు శివుని శరణు వేడెను. శివుడు దయతో అతనిని రోగ విముక్తిని చేసి తన శిరముపై స్థాన మిచ్చెను. అది మహాభాగ్యముగా దలచి చంద్రుడు సుఖముగా నుండెను. ఆశ్విన్యాదులు రోగ విముక్తుడై శివుని తలపూవై ఆనందించు చున్న చంద్రుని జూచి యేడ్చుచు దక్షుని దగ్గరకు బోయి విషయము చెప్పిరి .పైగా " నీవేదో మాకు మేలు చేయుదవు గదా యని నీకు చెప్పినాము .నీవు మా భర్తను శపించి మాకు దూరము చేసితివి . భర్తయే సర్వస్వ

వమని భావించి సేవలు చేయవలసిన మేము అతనిపై ద్వేషము పెంచుకుని , నీకు చెప్పి చాలా తప్పు చేసినాము " అని విచారించిరి .వారి విచారము చూడలేక దక్షుడు శంకరుని సన్నిధికి పోయెను .శంకరుడాతనిని జూచి లేచి నమస్కరించెను .అతనిని జూచి దక్షుడు కోపము నణుచుకొని , " ఈశ్వరా !చంద్రుడు నాకుమార్తెలకు ప్రాణ ప్రియుడు .అతనిని వెంటనే మాకిమ్ము . లేనిచో నిన్ను ఘోరముగా శపింతును." అనెను .శివుడు " నన్ను నీవు శాపముతో భస్మము చేసినను శరణా గతుడగు చంద్రుని విడువ " ననెను . దక్షుడు శపించుటకు సిద్దపడగా శంకరుడు శ్రీ కృష్ణుని మనసులో ధ్యానించెను .ఆయన వృద్ద బ్రాహ్మణ వేషముతో వారి యెదుట ఆవిర్భ వించెను. శివుడను దక్షుడను నమస్కరించిరి .భగవానుడు శంకరునితో నిట్లనెను. "ఈ దక్షుడు ముక్కోపి ఎవ్వని నైనను శపించగలడు. తనను తాను రక్షించు కోవలెను గదా ! దుష్టునికి శిష్టుడు భయపడవలెను. దుష్టునికా భయముండదు . అందుచేత చంద్రుని విడిచిపెట్టుము ." ఈ మాటలు విని శివుడి ట్లనేను . ధర్మమూ విడచిన వానిని అన్ని యైశ్వర్యములును విడిచి పోవును. ధర్మము పాటించు వారిని ఆ ధర్మమే రక్షించు చుండును . కావున శరణాగతుని విడిచి పెట్టలేనని ఈశ్వరుడనెను.
అప్పుడు భగవానుడు దక్ష శాపగ్రస్తుడై క్షయ రోగము గల చంద్రుని శివ శిరస్సుపై నున్న చంద్రుని నుండి వేరు చేసి దక్షున కిచ్చి ,రోగము లేని స్వచ్చమైన చంద్రకళను శివుని శిరస్సుపైనే ఉండనిచ్చి వారిద్దరిని సమాధాన పరచెను .దక్షుడు తనకు దక్కిన చంద్రుని కూతుండ్ర కిచ్చెను .అతడు శుక్ల పక్షమున వృద్ది నొందును .కృష్ణ పక్షమున క్షీణిం చుచు ఉండును.


 First  2  3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17  Last

No comments:

Post a Comment