దానికి తూర్పున మందార పర్వతమును, దక్షిణమున కైలాస గంధ మాదనములును, పశ్చిమమున విపులమును, ఉత్తరమున సుపార్శ్వము అను
పర్వతములుండును. దానియందు కదంబ, జంబూ, పిప్పల, వట వృక్షములు పదునొకండువందల
యోజనముల దాకా వ్యాపించియుండును. జంబూ (నేరేడు) వ్రుక్షములుండుటచే దేనికి
జంబూద్వీపమనే పేరు గలిగెను. ఆ వృక్షములకు ఏనుగులంత ఫలములుండును.
అవి రాలిపడినప్పుడు వాని రసముతో జంబూనది పుట్టి ప్రవహించుచుండును. ఆ
నదిలోని మట్టి గాలికి ఆరి జంబూనదమని పిలువబడుచు స్వచ్చమైన సువర్నముగా
ప్రసిద్ధికెక్కెను. భద్రాశ్వ, కెతూమాలములనెడు వర్షములును, మరవకములును, హరి వర్షములును, జంబూనది మధ్యమున వెలసియుండును.
మేరువు శిరస్సున బ్రహ్మనిర్మితమైన
ఒక మహానగరము కలదు. ఆ నగరమునకు అష్టదిక్కులందును అష్టదిక్పాలకుల నగరములుండును.
శ్రీహరి, భద్రాశ్వమున హయగ్రీవుడై, కేతుమూలమున వరాహామూర్తియై, జంబూద్వీపమున కూర్మమూర్తియై, మేరు (కురువక) వర్షమున
మత్స్యమూర్తియై, ఇతర వర్షములలోను అనేక రూపములు ధరించి విశ్వరూపుడై
ప్రకాశించుచుండెను.
ఒక జంబూద్వీపము దప్ప తక్కిన
ద్వీపములన్నియు దేవతానివాస యోగ్యములై యుండును. అక్కడివారు, ఆకలిగాని, వార్ధకముగాని రోగములుగాని లేక
పండ్రెండు వేల సంవత్సరములు ఆయుర్దాయము గలిగి
భోగభాగ్యములతో తుల తూగుచుందురు. కృత త్రేతాది యుగముల కాలప్రమాణములు అచ్చట
నుండవు.
భారత వర్షమునకు ఉత్తరమున హిమాలయములును, దక్షిణమున సముద్రమును ఉండును. తొమ్మిదివేల చతురపుయోజనములు దాని
వైశాల్యము. స్వర్గము, మోక్షము కోరువారికిది కర్మభూమి.
(మిగిలినవి భోగభూములు) మహేంద్ర, మలయ, సహ్యా, శుక్తిమత్, ఋక్ష, వింధ్య, పారియాత్రములను ఏడు కులపర్వతములు
ఇందుండును.
స్వర్గము, నరకము, మోక్షము అనునవి ఇక్కడివారి
కర్మాచరణమును బట్టియే కలుగుచుండును. ఇక్కడ తప్ప మరియొకచోట కర్మాచరణము అన్నది లేదు.
ఇంద్ర, కశేరు, తామ్ర, గభస్తిమత్, నాగ, సౌమ్య, గంధర్వ, వారుణభారతములని నవఖండములుగా ఈ భరతవర్షము విభజింపబడెను. మన
భారత ఖండము ఇందులో తొమ్మిదవది. దీని మూడువైపులను సాగరముండును. ఇది
వేయి చతురపుయోజనముల వైశాల్యము గలది.
No comments:
Post a Comment