నారదుడు ,శ్రీమన్నారాయణుని జూచి ,మహాత్మా ! పరశురాముడు గణేశుని ,తులసీ పత్రములతో తప్ప మిగిలిన వానితో పూజించెనని చెప్పితిరి కదా ! అందుకు కారణ మేమో తెలిపి నన్ను అనుగ్రహింప మని యడిగెను.
నారాయణు డిట్లు చెప్పెను " నారదా ! దీనికొక ఇతిహాసమున్నది .పూర్వమొక బ్రహ్మ కల్పములో జరిగినద.
గణేశుడు ,యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుని హృదయ పద్మము నందు నిలుపుకొని గంగా తీరమునందు ధ్యానము (తపస్సు ) చేసికొను చుండెను. రాధాదేవి స్వరూపురాలైన రుక్మిణి యంశతో జన్మించిన తులసి ,విహారము చేయుచు అక్కడికి వచ్చి శ్రీ కృష్ణాంశ సంభూతుడైన గణపతిని జూచి మోహ పరవశు రాలయ్యెను. అప్పటి కింకను గణేశునకు పెండ్లి కాలేదు .తులసి అతని ధ్యానమునకు భంగము కలిగించుటకై పుడిసెడు నీళ్ళు అతని నెత్తిమీద పోసి వ్రేళ్ళతో మొత్తుచు, "సంధ్యా కాలమగు చున్నది .ఇంకా తపస్సేమి చేసెదవు ?లెమ్ము లెమ్ము "అనెను. గణపతికి ధ్యాన భంగమై కనులు విప్పి చూసెను. ఎదురుగా మహా సౌందర్యముతో ప్రకాశించుచు ,తనను కోరికతో చూచు చున్న
తులసి కనబడెను. గణేశుడు "అమ్మా ! నీ వెవ్వతెవు? ధ్యాన భంగము చేయుట పాపమని నీకు తెలియదా ? శ్రీ కృష్ణుని దయ చేత నీకా పాపము సంభవింప కుండును గాక "అని పలికెను .తులసి యతనిని జూచి " నేను తులసి యను దానను నవ యౌవనములో నున్న దానను .భర్త కొరకు అన్వేషించు చున్నాను . నాకు నీవు పతివిఆగుము "అనగా గణేశుడా మాటలు విని ,మనస్సులో శ్రీకృష్ణుని స్మరించు కొనుచు ఆమెతో నిట్లనెను. " ఓ తల్లీ ! నాకు పెండ్లి చెసుకొనవలెనను కోరిక లేదు. భార్యా స్వీకారము దుఃఖ కారణ మగును .అది హరి భక్తికిని ,తపమునకును నాశన కారణ మగును . జన్మ బంధన పాశమై మోక్ష ద్వారమునకు తలుపు వంటిది. (ప్రతి బంధకము )అగును. తత్వ జ్ఞానమును బోగొట్టును. మాయావరణము వలన మూడత్వము కలిగించును. దాని మూలమున పాపములు చేయుటకు దారి యేర్పడును . అందుచేత నేను పెండ్లికి ఇష్టపడను . నీకు తగిన వానిని ,నిన్ను కోరెడు వానిని చూచుకొని నీ కోరిక తీర్చు కొనుము. అది నీకు చాలా మంచిది "
తులసి ఈ మాటలకు కోపించి ,"నీకు వివాహమగును . "నీకు వివాహమగును నీకు వచ్చెడి భార్య సాధ్వి కాక యుండును 'అని శపించెను . (సాధ్వి =సత్ప్రవర్తనము గలది ).
గణేశుడు అంత పరమ శాంతుడై యుండియు ,ధ్యాన భంగము చేసి ,ఆకారణముగా శపించిన యామెను జూచి ," నీవు రాక్షసుని భార్యవగుదువు ఆ తరువాత ఒక మహాత్ముని శాపము వలన వృక్ష స్వరూపము పొందెదవు " అని శపించగా ,విని తులసి తన అవివేకమునకు పశ్చాత్తాప పడి ఏడ్చెను. అది చూచి గణపతి ఆమెపై జాలి దలచి "పత్ర పుష్పములలో నీవు ప్రధాన మగుదవు. నీవు కూడా శ్రీ కళతో వృక్షముగా బుట్టి నారాయణునకు పరమ ప్రియురాల వగుదువు. సర్వ దేవతలకు ఇష్టురాల వగుదవు. విశేషించి శ్రీ కృష్ణ భగవానునకు ప్రియాతి ప్రియురాల వగుదవు . "
అని ఆమెతో చెప్పి తిరిగి తపస్సు చేసి కొనుటకు వెళ్ళిపోయెను .తులసి కూడ మొదట రాక్షస రాజకుమారుడైన శంక చూడునకు భార్యయై ,తరువాత విష్ణుమూర్తి శాపము చేత తులసీ వృక్షమై జన్మించి సర్వ దేవతా పూజలలో ప్రధాన స్థానమును పొందెను.
అందుచేత వినాయక చతుర్ది నాడు తప్ప ఇతర దినములందు విఘ్నేశ్వరుని తులసితో పూజింప రాదు .
ఇది గణపతి ఖండము (బ్రహ్మ వైవర్త పురాణము )
No comments:
Post a Comment