Thursday, March 6, 2014

శ్రీ లింగ పురాణము9






హరి మిత్రుడును ఒక విప్రుడు నా రాజ్యములో నుండెను. అతడు పరమభక్తుడు. శివునిబూజింపనిదే భుజించెడి వాడు కాడు. నా యాజ్ఞ విని భయపడి ఊరి చివర మర్రి చెట్టు క్రింద కూర్చుండి తన పూజ ముగించుకొని వచ్చెడి వాడు. ఒక నాడు నా గూఢచారులు అతనిని పట్టుకొని నాముందు నిలువ బెట్టిరి. నేనతనిని జూచి " రాజశాసనమును ధిక్కరించిన వారికి మరణశిక్ష విధింపవలెను. కాని దయతలచి విడుచుచున్నాను. నీవు నా రాజ్యమును వదలి పొమ్మ" నిశాసించితిని. అతడు, " రాజా! మన మందరమును దైవ శాసన మునకు విధేయులమై నడువ వలసిన వారము. నీవు దైవమును గాదని నిన్నే కీర్తింపుమని యాజ్ఞాపించినావు.
నీ వంటి ఆధర్మ పరుని రాజ్యములో నుండుటకు నేనే ఇష్ట పడుట లేదు. నీకీ దేవాపచారము మంచిది కాదు" అని హెచ్చరించి వెళ్ళిపోయెను. విప్రుని హితము నా చెవికెక్కలేదు. దేహము చాలించి యముని వద్దకు బోయితిని. ఆయన నన్ను జూచి "నీవు దైవాపచారము చేసినందువలన ఒక మన్వంతరము కాలము గ్రుడ్ల గూబ వైయుండుము. మిగిలిన విషయములలో ధర్మముగా నున్నందు వలన పూర్వ స్మృతియు, గాన విద్యాపాండిత్యమును నీకు గలుగు" నని నన్నిక్కడికి పంపినాడు. పది మహాయుగములు గడచినవి. గంధర్వ కిన్నర సాధ్యులు వచ్చి నా యొద్ద సంగీతము నేర్చుకొనుచున్నారు. నీకు ఆ విద్య నేర్పి ధన్యుడ నయ్యెదను".    

First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  Last



No comments:

Post a Comment