Thursday, March 13, 2014

శ్రీ నారద పూరాణము14




ఆమె సంతోషముతో సాగనంపెను. ఆయన వేటకు కావలసిన ఏర్పాటుతో అరణ్యమునకు బయలుదేరెను. దారిలో వామదేవుడు రాజును దీవించి కుశల మడిగెను."నా యింటి కతిధిగా వచ్చినావు. నీ కోరిక యేమో చెప్పుము. తీర్చెద" ననెను. రాజు, "మహత్మా! మీ దర్శనము వలన నా కన్నియు సమకూరినవి. మన సెరిగిన యిల్లాలున్నది. పితృవాక్య పరిపాలకుడై భూమండలము నేలుటకు సమర్థుడైన కొడుకున్నాడు. సర్వభోగములున్నవి. ఇవన్నియు పూర్వజన్మ సుకృతము వలన వచ్చును. గాని ఊరక వచ్చునా?" అనగాముని, "అవును రాజా!నిజమే. నీవు పూర్వజన్మములో శూద్రుడవు. పరమ దుర్మార్గుడవు. నీ భార్యకూడ అంతే. ఒక నాడు గంగానదీ తీరమున ఒక పండితులు పూరాణము చెప్పుచు, శ్రావణశుద్ద  విదియ మొదలు నాలుగు నెలలు పుణ్యమైనవి.
--అపుడు అశూన్యశయన వ్రతము చేసినవానికి ముక్తి గలుగునని చెప్పగా విన్నావు. నీ కర్మము పరి పక్వమై ఆ వ్రతముచేసి ఈ మహారాజు జన్మ మెత్తినావు"అనగా విని సంతోషించి మునికి మ్రొక్కి మందర పర్వతమునకు వెళ్ళెను. అక్కడ మోహినిని జూచి కామమోహితుడై తన్ను పెండ్లాడుమని కోరెను."నేను కోరినది యిత్తు నన్నచో నిన్ను పెండ్లాడుదు"నని ఆమెయనగా అంగీకరించి గాంధర్వవివాహ మాడెను. క్రొత్త భార్యతో తన నగరమునకు వచ్చెను.  
 దారిలో నొక బల్లి రాజుతో, తాను పూర్వజన్మములో భర్తను వశముచేసి కొనుటకై ముందు పెట్టి, నరక మనుభవించి బల్లిగా పుట్టి తిననియు, విజయాద్వాదశీ పుణ్యమిచ్చి రక్షింపు మనగా రాజు దానికా ఫలమిచ్చి తరింపజేసెను.        
        ధర్మాంగదుడు, సవతితల్లితో వచ్చిన తండ్రిని సగౌరవముగా ఆహ్వానించి లోనికి దీసికొని పోయెను. తన తల్లితో "అమ్మా! క్రొత్త సవతిని జూచి అసూయ పడకు"మని భోధించి, మోహినిని తన మందిరమున కాహ్వానించి సకల మర్యాదలును చేసి, మిగిలిన సవతితల్లులకు అపారధనము లిచ్చి, "సవతి మచ్చరము విడిచి రాజు కోరికను మన్నింపు'డని ప్రార్ధించెను. వారంగీకరించిరి. మోహినికి అపురూపమైన కానుక లిచ్చెను. మోహినికి అపురూపమైన కానుక లిచ్చెను. మోహినీ రుక్మాంగదులు ఎనిమిదేండ్ల పాటు ఆనందముగా విహరించిరి. ఇంత ఆనందములో గూడ రుక్మాంగదుడు ఏకాదశీ వ్రతములను మరువక యధావిధిగా ఆచరించుచుండెను.    
 రాజు వృద్దుడగు చుండెను. కాని మోహిని పై మోజు తీరలేదు. తొమ్మిదవ యేట ధర్మాంగదుడు విజయ యాత్రకు వెళ్ళి విద్యాధరులకు గెలిచి ఐదు మహాముణులను దెచ్చెను. వానిలో ఒకటి లక్షకోటి సువర్ణము లిచ్చును, ఒకటి నవయౌవనము నిచ్చు రసాయనము గురిపించును, మరొకటి ధాన్యాది సంపత్తి నిచ్చును, ఇంకొకటి ఆకాశగమనము నిచ్చును. ఇవన్నియు చింతామణులు.        
తరువాత నాగ లోకమునకు బోయి వారిని గెలిచి అనేక రత్నములను, నాగ కన్యకలను దెచ్చెను. వరుణుని మీదికి దండెత్తి అతడెదిరించగా ఏడాది పాటు యుద్దము చేసి ఓడించెను.అతడు ధర్మాంగదునికి తన కుమార్తెను భార్యగా నిచ్చి వేయి జాతి గుఱ్ఱములను కానుకగా నిచ్చెను.


First  2  3  4   5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last

No comments:

Post a Comment