Tuesday, May 13, 2014

శ్రీ బ్రహ్మాండ పురాణము 1




బ్రహ్మాండ పురాణము
సకల పురాణ వేత్త యైన సూతుని శౌనకాది మహామునులు, బ్రహ్మాండ పురాణ విశేషములు చెప్పుమని యడుగగా అతడు గురువులకు దేవతలకును వందనములు చేసియిట్లు చెప్ప నారంభించెను.

ఓ మునులారా! " బ్రహ్మాండ చరితోక్త త్వాత్ బ్రహ్మాండ మితి కీర్తి తమ్" (బ్రహ్మాండము యొక్క చరిత్రను చెప్పుటచే ఇది బ్రహ్మాండ పురాణమని ప్రశంసింపబడెను) అని వ్యాస భగవానుడే దీనిని ప్రశంసించెను.

ఈ పురాణమును జదివినచో మన పూర్వ యుగములవారు, కల్పములువారు ఎట్లు బ్రతికినారో, వారి జీవన విధాన మెట్టిదో, ప్రపంచ మెట్లు పురోగతిని సాధించుకొన్నదో, మనుష్యుల ఆచార వ్యవహారము లెట్లు మార్పు చెందుచు వచ్చినవో తెలియును.    

ప్రపంచ సృష్టి
లోకములన్నియు నశించి ప్రపంచము జలమయమై యున్నప్పుడు పర బ్రహ్మమునకు సృష్టి చేయు సంకల్పము గలిగెను. దానితో పూర్వ కల్పములలో నున్న విధముగానే సృష్టి ప్రారంభ మయ్యెను.    


అటువంటి ప్రారంభ స్థితిలో మానవులలో జాతిమత వర్ణ వర్గ భేదములు లేవు. పశుపక్ష్యాది జంతువులు గూడ ఎక్కువగా లేవు. కందమూలములు, పండ్లు, కాయలు, ఆకులూ ఇవే ఆహారముగా ఉపయోగింపబడెడివి. ఇవి జ్ఞానము వృద్ది చేయు సాత్త్వికాహారములు కావున మానవులు వానినే ఉపయోగించెడి వారు. భూమిమీది వాతావరణము ఎక్కువ శీతలముగాక, యెక్కువ ఉష్ణముగూడ కాక సమానముగా నుండెడిది. ఆనాటి మానవులు తపశ్శక్తి సంపన్నులు. సంకల్ప మాత్రముననె వారు కోరిన విలభించెడివి. వారికి భూమినుండి స్వర్గమునకు గాని పాతాళ లోకమునకు గాని అవసరమైనప్పుడు వెళ్ళగలిగిన సామర్ధ్య ముండెడిది. వారి వయస్సు గూడ చాల సంవత్సరములుండెడిది. అల్పాయుష్కులు  కారు. వారు సంకల్పించినచో సృష్టికి అనుసృష్టియు, ప్రతిసృష్టియు చేయగలిగిన యుండెడివారు. దేవతలతో సమానమైన రూప సంపదలు, మహానుభావములు గలవారు పుట్టుచుండెడి వారు. ఈర్ష్యాసూయలు లేక, పరస్పర మైత్రిలో చాల వరకు జీవనము గడచి పోయెడిది.        

                                
                       చాల కాలము ఈరీతిగా గడచెను. తరువాత తరువాత మానవులకు తపశ్శక్తి, మానస (సంకల్ప) శక్తియు సన్నగిల్లుచు వచ్చెను. ఇది కృత యుగము సంగతి.

No comments:

Post a Comment