Wednesday, May 14, 2014

శ్రీ బ్రహ్మాండ పురాణము20




పిశాచము వానిపై కక్ష వహించి వాని నావేశించెను. దానితో వాడందరిని జంపి నదిలో బారవేయుచుండగా తండ్రి ,దేశము నుండి బహిష్కరించెను .
రెండవ భార్య సుమతి గర్భము నుండి ఒక అలాబువు (ఆనపకాయ ) పుట్టెను. దానిని ఆమె ఆవల బార వేయుటకు యత్నించు చుండగా ఔర్వ మహాముని అక్కడకు వచ్చెను. "ఆ కాయ నిండా అరువది వేల బీజము లున్నవి. వానిని  జాగ్రత్తగా చూచు కొన్నచో ఆరవది వేల మంది పుత్రులు కలుగుదురు"అని అతడు చెప్పెను. అట్లే అరువది వేలమంది కుమారులు పుట్టిరి. వారు పెరుగు చున్న కొలదీ వారిలో దుర్మార్గము కూడా పెరిగిపోయెను. వారు అందరిని బాధించుచు లోక కంటకు లైరి .యజ్ఞములను ద్వంసము చేయుచుండిరి .దానితో దేవతలీ సగర పుత్రులను పరి మార్పు ఉపాయమేమి యని బ్రహ్మ నడిగిరి .ఆయన దేవతలతో ,"కపిల మహాముని పాతాళమున తపము చేయుచున్నాడు. ఆయన నారాయణాంశ సంభూతుడు ఈ సగర పుత్రులను ఆయన ముందురు త్రోయుడు . కపిలుని కోపాగ్నికి వారు భస్మ మగుదురు .ఆ యుపాయమును మీరు ఆలోచింపుడు. అని చెప్పెను.
సగరు డశ్వమేద యాగము చేయ సంకల్పించెను .యాగాశ్వమును రక్షించుటకు సగర పుత్రు లందరును దాని వెనుక బయలు దేరిరి . ఈ అవకాశమును ఇంద్రుడు ఉపయోగించు కొనెను .వాయుదేవుని సహాయముతో అశ్వమును దొంగిలించి కపిల మహాముని దగ్గర నిలిపెను. సగర పుత్రులు చూచు చుండగా గుఱ్ఱము భూమిలోనికి కూరుకొని పోయెను. వారు దానిని తిరిగి సంపాదించుటకై భూమిని త్రవ్వి వేసిరి. అప్పటికి సముద్ర జలములు లేవు .దేవతలు రాక్షసులతో యుద్దము చేసి వారిని సంహరించు చుండగా కొందరు రాక్షసులు సముద్ర గర్భములో దాగు కొనిరి . దేవతలు అగస్త్య మహా మునిని ప్రార్ధించి , "సముద్ర జలములను నీవు త్రాగి వేసినచో రాక్షసులను మేము సంహరింతు" మనిరి . అగస్త్యుడు అంగీకరించి సముద్రజలమును త్రాగివేసెను .భూమి బయట పడగానేదేవతలా రక్కసులను జంపివేసిరి.
ఆ నేలనే త్రవ్వుకొనుచు సగర కుమారులు పాతాళ లోకము వరకు వెళ్ళిరి.అక్కడ వెదుకగా కపిల మహర్షి ప్రక్కనే కట్టివేయబడిన యాగాశ్వము కనిపించెను .ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించి దొంగ తపస్సు చేయుచున్నాడని తలచి వారందరును కపిలుని తపో భంగము చేసి హింసించ బోయిరి .కపిలుడొక తీక్షణమైన చూపు చూసేను. అందుండి అగ్ని జ్వాలలు వెలువడి వారి నందరును భస్మము చేసెను.
సగరునకు ఈ విషయము తెలిసి విచారించెను .మనుమడు అంశుమంతుని బిలిచి " నీవా  యాగాశ్వమును ఇమ్మని కపిల మహర్షిని ప్రార్ధించి తీసికొని రమ్ము .ఎంత విచారములో నున్నను యజ్ఞమును పరిసమాప్తి చేయక మధ్యలో విడువరాదు " అని చెప్పగా అతడు వెళ్లి కపిలుని ప్రార్ధించి అశ్వమును దెచ్చెను. సగరుని యజ్ఞము పూర్తి యయ్యెను. పుత్ర శోకముతో క్రుంగి పోయిన సగరుడు మనుమనికి రాజ్య పట్టాభిషేకము చేసి తాను తపమునకై అడవులకు బోయెను.
అంశు మంతుడు కపిలుని కోపాగ్ని లో బడి భస్మమైన పిన తండ్రులకు ఉత్తమ గతులు గలుగు టెట్లని పండితుల నడిగెను.
  First 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 Last

No comments:

Post a Comment