Thursday, May 22, 2014

శ్రీ మద్భాగవతము9




చిత్ర కేతూపాఖ్యానము
చిత్ర కేతుడు శూర సేన దేశమునకు రాజు .సంతానము కొరకు కోటి మంది స్త్రీలను పెండ్లాడెను .కాని ఫలము లేకపోయెను . ఒక నాడంగీరసుడను ముని అతని మందిరమునకు రాగా ,రాజు పూజించి ,తన అపుత్రత్వమును గూర్చి చెప్పెను .
అంగీరసుడు రాజుచేత పుత్రకామేష్టి చేయించి యజ్ఞ ప్రసాదము నాతని పట్టపు రాణి కృత ద్యుతికి ఇచ్చెను. రాజునకు కుమారుడు పుట్టెను .రాజు ఆ పుత్రుని వ్యామోహములో పడి ,వానిని వాని తల్లిని మిక్కిలి ఆదరించు చుండెను .ఇది తక్కిన రాణులకు కంటగిం పయ్యేను . వారు బాలునికి విషము బెట్టి చంపిరి. మరణించిన బాలునికై రాజును రాణియు విలపించు చుండగా అంగీరసుడు నారదునితో వచ్చి రాజుతో ఇట్లనెను. "రాజా ! " ఋణాను బంధ రూపేణ పశుపత్ని సుతాలయాః " అందురు . (పశువులు ,భార్యలు,కొడుకులు ,ఇండ్లు మొ|| ఋణమును బట్టి వచ్చుచు పోవుచుందురు) జగత్తు స్వప్నము వంటిది . స్వప్నము నిజమగునా ? కర్మ వశమున జీవులు పుట్టి గిట్టు చుందురు. నీకు వీడేమగును? వానికి నీవేమగుదువు? ఇదంతయు భౌతిక దేహమున్నంత వరకే . నీవు శ్రీ హరిని ధ్యానించుచు మోహ వికారములను త్యజింపుము." నారదుడు , "రాజా ! నీకును వీనికి ని బందుత్వమేమున్నదో చూడు " మని బాలుని దేహమును జూచి ,"జీవా ! మే తల్లి దండ్రులను బంధువులును నీకై దుఃఖించు చున్నారు. నీవు తిరిగి ఈ దేహములో ప్రవేశించి వీరికి సంతోషము గలిగింపు "మనెను .
బాలుడు , " కర్మ బద్దుడనై అనేక జన్మము లెత్తుచున్ననాకు వీరే జన్మములో తల్లిదండ్రులు ? ఒక్కొక్క జన్మములోను వేర్వేరు తల్లి దండ్రులు బంధువులు నాకేర్పడుచున్నారు .సర్వేశ్వరుడైన శ్రీ పతి తన మాయాదీనులను జేసి జీవులను పుట్టించుచు తిరిగి తనలో లీనము చేసికొనును .
క . పతులెవ్వరు ? సతులెవ్వరు ?
     సుతులెవ్వరు? మిత్ర శత్రు సుజన ప్రియసం
     గతులెవ్వరు ? సర్వాత్మక
     గతుడై గుణ సాక్షి యైన ఘను డొక్కనికిన్ ||




No comments:

Post a Comment