శ్లో|| పురాణేషుచ సర్వేషు శ్రీమద్భాగవతం పరమ్
యత్ర ప్రతిపదం కృష్ణో గీయతే బహుదర్శిభి: ||
శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కృష్ణేన భాషితం
పరిక్షితే కథాంవక్తుం సభాయాం సంస్థితే శుకే ||
తా: ఋషులు ప్రతిపదమునందును శ్రీకృష్ణుని ప్రశంసిచుటకు కనబడుచున్నందు వలన భాగవతము సర్వ పురాణములలో శ్రేష్టము. వేదవ్యాసుడు చెప్పిన శ్రీమద్భాగవతము కలియుగములలో శాస్త్రమైనది. దానిని శుకుడు పూర్వము పరీక్షిత్తునకు వినిపించెను. అని పద్మ పురాణము చెప్పుచున్నది.
శ్లో|| భాగవత్యా శ్చ దుర్గాయా శ్చరితం యత్ర విద్యతే
తత్తు భాగవతం ప్రోక్తం నతుదేవీ పురాణకమ్ ||
తా: భగవతియైన దుర్గ చరిత్రమును జెప్పుచున్నది భాగవతము. కాని ఇది దేవీ పురాణము కాదు. అని శివ పురాణము చెప్పుచున్నది.
ఈ యభిప్రాయభేదము లుండుట చేతనే యీ అష్టాదశ పురాణవాణి యందు మొదట శ్రీ కృష్ణ భాగవతమే గ్రహింపబడినది. అయిననూ దేవీ మహత్యమును కొంచమైననూ చెప్పుట శ్రేయస్కరమని, దేవీ భాగవత విషయములు గూడ ప్రస్తావింపబడుచున్నది.
దేవీ మహిమ - 1
పూర్వ మొకప్పుడు సర్వజగము జలమయమై యున్న సమయములో బ్రహ్మ తామర పువ్వునందు బుట్టెను. ఆయన " నే నెవ్వరి వలన బుట్టితిని ? నేను కూర్చున్న పద్మమున కాధారమేమి?" అనుకొనుచున్న సమయములో "తప - తప "అను మాటలు ఆకాశమునుండి వినబడెను. మరేమియు ఆలోచించక కొంతకాలమాయన తపము చేసెను. తరువార "సృజ - సృజ" అను మాటలు వినబడెను. బ్రహ్మ "నే నేమి సృజింపవలె" నని యోచించుచుండగా మధుకైటభులను రాక్షసులు అతనిని తరిమిరి. బ్రహ్మ భయపడి తామర కాడలో నుండి నీటిలోనికి దిగెను. అక్కడ శంఖ చక్రాది లాంచనములు గల విష్ణుమూర్తి కనబడెను. ఆయన యోగనిద్రను చాలించి మధుకైటభులను వధించెను. రుద్రుడు అక్కడికి వచ్చెను. వారు ముగ్గురును తమ జన్మములకు కారణభూతులైన పరదేవతను ప్రార్దించిరి. అక్కడికొక విమానము వచ్చెను. దానిలో గూర్చుండిన దేవీ, త్రిమూర్తులను "దానిపై నెక్కు డనెను".
No comments:
Post a Comment