Thursday, May 15, 2014

శ్రీ మత్స్య పురాణము9




మహాదేవుడు ఆ రధముపై కూర్చుండి రాక్షసులపై దండెత్తి పోయి విష్ణు బాణమును ధనస్సులో సంధించి ఆక ర్ణాంతము లాగి విడిచెను . ఆ బాణము మహావేగముతో ముందు కాంచన నగరమును ,తరువాత రజత నగరమును ,ఆ పిమ్మట లోహ నగరమును వరుసగా పేల్చి ద్వంసము చేసెను. త్రిపురములతో పాటు వానిలో నున్న రాక్షసులు గూడా నామ రూపములు లేకుండా పోయిరి.
మ్లేచ్చులు
బ్రహ్మ దేవుడు మొదట స్వర్గ లోకమును సృజించి ,దానిలో అవసరమైన భవనములను వస్తు సామాగ్రులను అన్నింటిని ఏర్పరిచి దేవతలను బిలిచి ,మీ కొరకై స్వర్గ లోకమును సృజించి అక్కడ సకల సౌకర్యములను కలిగించినాను . మీరందరును స్వర్గమునకు బోయి సుఖముగా నివసింపుడు. అని వారినక్కడకు పంపి వేసెను. పాతాళ లోకమును ,అవసరమైన వస్తు సముదాయమును సృష్టించి ,రాక్షసులను బిలిచి ,వారిని అందుండు డని నియోగించి పంపివేసెను.ఇంక మనుష్యుల కొఱకై భూలోకమును సృజించి ,అచ్చట సముద్రములు ,నదీ నదములు ,పర్వతములు ,వృక్షములు ,అరణ్యములు ,పశువులు ,పక్షులు అన్నింటిని సృష్టించెను. మానవులను బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములుగా విభజించి ,వారికి తగిన జీవనోపాయములను ,సాధనములను ఏర్పరచెను . మనుష్యులకు పశువులకు ,పక్షులకు వారి జాతకులకు తగినట్లు ఆహార పానీయములు నియమించెను. వారు వర్ణాశ్రమ ధర్మములు చక్కగా నిర్వర్తించుటకు ,గౌతమ ,అత్రి, భరద్వాజ ,గౌతమ ,వసిష్ఠ పరాశరాది మహా మునులను ధర్మ శాస్త్రములు రచింప వలసినదిగా నియమించి భూలోకమునకు పంపెను. వారు ఆ విధముగా ప్రజల నడవడికలను సరి చేసెడి ధర్మ శాస్త్రములను రచించిరి. మనువులు రాజ వంశములను వ్యాపింప జేయగా ఆ రాజులు ధర్మ మార్గమునను ,నీతి మార్గమునను పరిపాలన చేయుచున్నదీ లేనిదీ గమనిం చుచు ఈ మహర్షులు నీతి శాస్త్రాదికములు గూడ రచించిరి .అంతేకాక , తృణ కాష్ట జల సమృద్దము లైన అరణ్య ప్రదేశము లందు ఆశ్రమము లేర్పాటు చేసికొని బ్రహ్మ ముఖము నుండి వెలువడిన వేద రాశిని తాము అధ్యయనము చేయుచు ,శిష్యులకు అధ్యాపనము ( బోధించుట ) చేయుచు ,వేదముల కర్ధములు తెలుసుకోనుటకై ,ఆ సంప్రదాయములు సుస్థిరముగా భూమియందు పాదు కొలుపుటకై శిక్షా వ్యాకరణ చ్చందో జ్యోతిష నిరుక్త కల్పములనెడి షడంగములను ,పూర్వోత్తర మీమాంసలను ,తర్కాది శాస్త్రములను రచించి, వానిని శిష్య పరంపరల ద్వారా లోక మంతటను వ్యాప్తి చేయు చుండిరి . యజ్ఞ యాగాది కర్మ కాండలను ,స్మార్త కర్మలను (వివాహోపనయనాది కర్మలను) ఎట్లు చేయవలెనో ,ఏయే సమయములలో ఆచరింపవలెనో తెలిపెడి గృహ్య సూత్రాదులను రచించి ,దేవ పూజా విధానములను తెలియ జెప్పి ప్రజలను ధర్మ పరులుగా ఆస్తికులుగా జేసి సక్రమ మార్గములో నడిపించుటకు తమ శక్తి సామర్ధ్యములను ధార పోసిరి.ఇదే సనాతన ధర్మము.
దీనిని ఆచరించు వారిని ఆస్తికులు అనిరి.

No comments:

Post a Comment