Thursday, May 15, 2014

బ్రహ్మపురాణము3




యముడు తండ్రియైన సూర్యుని కడకుబోయి, సవతి తల్లి తమమీద చూపుతున్న నిరాదరణమును గూర్చియు, సావర్ణి, శనులమీద చూపెడు ప్రేమయు, తల్లి పక్షపాతబుద్ధియు చెప్పి, నాకు గలిగిన శాపమును నివారింపుము అని కోరెను. సూర్యుడు అతని ఓదార్చి, "నాయనా! యమా! నీవు సత్యవంతుడవు, ధర్మమార్గ వర్తనుడవు అటువంటి నీకే కోపమువచ్చునట్లు చేసినదనగా ఆమె యెంత అనుచితముగా ప్రవర్తించినదో గ్రహించగలను. తల్లి శాపము త్రిప్పుట నావశము కాదు. కాని నీ ధర్మప్రవర్తనయే నిన్ను శాపవిముక్తుని జేయును" అని పలికెను.      
ఛాయనుజూచి సూర్యుడు, "నీవు నీ పిల్లలమీద ఇట్లు భేదబుద్ధి చూపుటకు కారణమేమి" అని గద్దించి అడిగెను. ఆమె సమాధానము చెప్పకుండుట చూచి దివ్యదృష్టితో అంతయు తెలిసికొని శపించబోయెను. ఛాయ అప్పుడు నోరు విప్పినది. సంజ్ఞకు తానూ ఛాయను (నీడను) అని చెప్పి తప్పుమన్నింపుమని వేడినది.

సూర్యుడామెను విడిచి మహాక్రోధావేశముతో మామగారింటికి బోయెను. త్వష్ట అతనిని శాంతపరచి, తానూ కుమార్తెను బుద్ధులు చెప్పి అప్పుడే పంపివేసితినని చెప్పెను. ఇంకను కోపముతో మండుచున్న సూర్యుని జూచి మామ యిట్లనెను. "అల్లుడా! ఒకమాట చెప్పెదను వినుము. నీ తేజస్సు మావంటి వారికే దుర్భరముగానున్నది కాదా౧ ఒక స్త్రీ, అందునను సుకుమారి యెట్లు భరించగలదు? అందుచేత నిన్ను సానపట్టి కొంత తేజమును తగ్గించెదను. అంగీకరింపుము "మనగా సోర్యుడు ఆమోదించెను. త్వష్ట సూర్యుని తిరిగెడు సానరాతిమీద అరుగాదీసెను. అట్లు అరుగదీసినందువలన తాపము (వేడి) తగ్గినదేమోకాని ఆ మెరుపుతో సూర్యుడింకను ప్రకాశవంతుడయ్యెను. త్వష్ట, సూర్యుని త్వష్ట, సూర్యుని అరుగాదీసినపుడు రాలిన తేజఃకణములతో (రజనుతో) విష్ణుదేవునకు చక్రముచేసి ఇచ్చెను.

సూర్యుడు సంజ్ఞను వెదుకుచు వెళ్లి ఒక అరణ్యములో పచ్చికమేయుచున్న ఆడగుర్రము రూపములో నున్న ఆమెను గుర్తుపట్టి తానుకూడా ఒక మగగుర్రమై ఆమెతో రతిక్రీడకు సిద్ధపడెను. ఆమె, తను బలాత్కరించినది మగగుర్రమని భావించి, సూర్యుని తేజస్సును తన ముక్కులనుమ్ది బయటకు విసర్జించెను. అది రెండుచోట్ల పడగా దానినుండి ఇద్దరు అశ్వనీ దేవతలు పుట్టిరి. వారే, నాసత్యులని పిలువబడిరి. సూర్యుడు సంజ్ఞకు నిజరూపము చూపి సంతోషపరచెను.

సూర్యుని సంతానమైన వైవస్వతుడు మనువయ్యెను. శ్రాద్ధ దేవుడు పిత్రులోకాధిపతి యయ్యెను. యముడు దక్షిణ దిక్పాలకుడయ్యెను. సూర్యసావర్ణుడు కూడా మనువగును. (ప్రస్తుతము వైవస్వత మన్వంతరము (మనువు పాలనము) జరుగుచున్నది. రాబోవునది సూర్యసావర్ణ మన్వంతరము). శనైశ్చరుడు గ్రహములలో నొక్కడయ్యెను. యమునా భూలోకములో నదిగా ప్రవహించుచున్నది. 


Last   2  3  4  5  6  7  8  9  10  11    Last




No comments:

Post a Comment