Sunday, December 15, 2013

శ్రీ మద్భాగవతము15




    విష్ణువు మోహిని యగుట
దేవతల ప్రార్ధనపై విష్ణువు దేవతలకు అమృతము పంచుటకై మోహినీ రూపము ధరించెను .రాక్షసులలో కలి గూడ ఉండెను. వాని చలువ వలన అమృతము కొరకు వారిలో వారికి కలతలు వచ్చెను. కొందరు ,దేవతలు గూడ సమాన భాగస్వాములే కావున వారికి గూడ సుధను పంచ వలెననిరి . మరికొందరు బలవంతులు అమృత పాత్ర నెత్తుకుని పోయిరి . వారి ముందు మోహిని అవతరించెను .
సృష్టిలో చాలా వరకు స్త్రీ సౌందర్యమే పురుషులకు మత్తు గొలుపును. అందులోను ఆమె జగన్మోహిని ,ఇంకేమి కావలెను ? జగత్తులో కాంతా కనకములను జూచి ఆకర్షితుడు కాని వాడెవ్వడు ? మోహిని అపురూప సౌందర్యమునకు వారు మోహితులైరి. అట్టి స్త్రీ రూపమునకు గాని మూర్ఖులైన రాక్షసులు లొంగరు . ఈ సృష్టి రహస్యము తెలిసిన వాడు కావున మాధవుడు జగన్మోహిని  అయ్యెను
రాక్షసులు ఆమె వెంట బడిరి. ఆమె "అమృత కలశమును నాకిచ్చినచో అందరికి సమానముగా పంచెద " ననెను. వారిచ్చిరి .దేవతల నొక బంతి గాను ,రక్కసుల నొక బంతిగాను కూర్చుండ బెట్టి దేవతలకు అమృతమును పోయుచు, రాక్షసులను కన్ను గీటి ,పైట జార్చి ,మైమరపించు మాటలు చెప్పి 'ఇదిగో ,మీకును అమృతము పోయుచున్నా " నని యూరించు చుండెను .ఎదురు మాటాడినచో ఆమెకు తమపై ప్రేమ నశించునే మో యని రక్కసులూర కుండిరి .
రాహువు సూర్య చంద్రుల మధ్యకు రాగా వారు మోహినికి సంజ్ఞ తో తెలిపిరి .శ్రీ హరి చక్రముతో వాని తల తరిగెను. అమృతము కంటము లోనికి దిగుటచే వాడమరుడయ్యేను. బ్రహ్మ వానిని రాహు కేతువులను రెండు రూపములుగా జేసి గ్రహస్థానమున నిలిపెను.
మోహిని అమృత మంతయు దేవతలకే పోయుటచే రాక్షసులు కోపించి దేవతలతో దెబ్బలాటకు దిగిరి దేవదానవులకు మహా సంగ్రామ మయ్యెను .హరి కటాక్షము నొందిన దేవతలు గెలిచిరి .
సముద్ర మధనమున అంతరార్ధ మున్నది .సాధకుడు మంచి చెడ్డలు తేల్చు కొనుటకై మనసును మధింప వలెను. సిద్ధికై సాధన చేయుట కూడా మధనమే. అపుడు విషము వంటి విషమ పరిస్థితులు వానికెదురగును. వానిని లెక్క చేయక సాధన సాగించినచో కామధేనువు ,కల్ప వృక్షము వంటి చిన్న చిన్న లాభములు మనసును లాగుటకు
ప్రయత్నించును .వానితో తృప్తి పడినచో సాధన అక్కడితో ఆగి పోవును,అట్లు గాక ముందునకు సాగినచో అమృత (మోక్ష ) ప్రాప్తి కలుగును. జీవునకు మోక్షమే పరమావధి గదా !



No comments:

Post a Comment