పద్మాకరుని కొక కుమారుడు గలడు. అతడును రాకుమారుడును ప్రాణ స్నేహితులై మెలగుచు ,గురువుల యెద్ద తమ తమ కులములకు దగిన విద్యలు శ్రద్దా భక్తులతో అభ్యసించిరి. ఒకనాడు ఋషభుడా రాకుమారుని యొద్దకు వచ్చెను. అతడు చదివిన చదువులను పరీక్షించి తెలిసికొని, "నాయనా ! నీకు శివారాధనము చేయు విధానమును , శివ కవచమును భోదించెదను. వానితో శంకరుని ఆరాధింపుము. నీకు సర్వత్ర జయము కలుగును " అని ధనుర్భాణములను, ఖడ్గమును ఇచ్చెను .భద్రాయువు (రాజ కుమారుడు ) నియమ నిష్టలతో పరమేశ్వరు నారాధించెను. శివానుగ్రహము వలన అపూర్వ శక్తులు లభించెను.
ఇంతలో దశార్ణ దేశ రాజైన వజ్రబాహుని పై మాగధులు దండెత్తి ఓడించి బంధించి, రాజ్యము నాక్రమించిరి .ఆ సంగతి తెలిసికొని భద్రాయువు పద్మాకరుని అనుమతి తీసికొని వెళ్లి ఏకాంగ విహరుడై మాగధులను రణమునకు బిలిచి తన పరాక్రమముతో విజ్రంబించెను . శివ కవచ ప్రభావము వలన శత్రువులు ప్రయోగించిన అస్త్ర శస్త్రములు ఇతని శరీరమును తాకి విఫల మయ్యెను . ఇతడు వారి నందరును సంహరించి శత్రు రాజును బంధించి ,సింహాసనము నాక్రమించెను . వెంటనే చెరసాలలో నున్న తల్లి దండ్రులను విడిపించి ,ఆ సింహాసనముపై తండ్రిని కూర్చుండ బెట్టెను. వజ్ర బాహుడు " నాయనా ! నీ వెవరవో నాకు తెలియదు. కాని నాకు చేసిన మహొపకారమునకు నేనును , నా రాజ్యములోని ప్రజలును ఋణపడి యున్నాము " అని పలుకు చుండగా శివయోగి అచ్చటికి వచ్చి ," రాజా ! రోగ గ్రస్తులని పూర్వము నీవడవిలో విడిచినావే ,నీ భార్యా పుత్రులను ! ఆ పుత్రుడే ఇతడు. నీ భార్య ఉత్తముడైన పద్మాకరుని రక్షణలో నున్నది ." అని చెప్పగా రాజు మహా నందముతో కొడుకును కౌగలించు కొనెను. రాణిని కూడా పిలిపించి వారితో సుఖముగా నుండెను.
No comments:
Post a Comment