Wednesday, December 18, 2013

బ్రహ్మపురాణము1




సూర్యుని వృత్తాంతము
శౌనకాది మహామునులు నైమిశారణ్యమున పండ్రెండ్రు సంవత్సరములు దీక్షతో ఒక మహాయాగము చేయుచుండిరి. అచటికి రోమహర్షణుడు (సూతుని తండ్రి) వచ్చెను. మునులందరూ అతనికి సకల మర్యాదలు చేసి "నీవు సర్వపురానములను చక్కగా ఎరిగినవాడవు. నీ కంటే తెలిసిన వారెవరున్నారు? కావున నీవు సృష్టి ప్రకారము మొదలు దేవ రాక్షస మానవ చరిత్రములు, భాగాద్విషయములును తెలియ జెప్పుము" అం యడుగగా సూతుడు (ఇతడును సూతుడే) ఇట్లు బ్రహ్మాండపురాణము చెప్ప నారంభించెను.

బ్రహ్మమానస పుత్రుడైన కశ్య ప్రజాపతికి దక్షుని కూతురైన అదితియందు వివస్వంతుడను కుమారుడు కలిగెను. అతడే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె యైన సంజ్ఞ నిచ్చి పెండ్లి చేసెను. ఆమె సూర్యుని ఉగ్రతేజమును సహింపలేకుండెను. ఆమె యోకనాడు సూర్యునితో, "స్వామీ! నీ తేజము భరింపరానిది గా నున్నది. అండములు (గర్భ పిండములుగూడ) మృతి నొందునట్లు చేయుచున్నది". అనగా  ఆమె భావమును గమనింపలేక సూర్యుడు "అలాగుననా? అట్లైనచో, మృతినొందునట్లు చేయు అండములు (బ్రహ్మాండములు) గలవాడను గనుక నపేరింక మార్తండుడగునని నవ్వుచు పలికెను. ఆమె ఇంకేమి మాటలాడలేక పోయినది. సూర్యునకు ఆమె యందు మొదట వైవస్వతుడును (మనువు), తరువాత శ్రాద్ధ దేవుడును, అపిమ్మట యముడు - యమున అను కవలపిల్లలు పుట్టిరి. ఇంతమంది పిల్లలు పుట్టినాను సూర్యునకు ఆమెయందు మోహము తగ్గలేదు. ఆ విషయము గమనించి సంజ్ఞాదేవి తననుండి ఛాయ యను దానిని సృజించి, "నేను నా పుట్టినింటికి బోవుచున్నాను. నీవు నా రూపమే కనుక నా స్థానములో నుండి భర్తను సంతోషపెట్టుము. నీవు ఛాయవని తెలియనియ్యకుము" అనగా ఆమె, "తప్పనిసరి పరిస్థితులలో గాని చెప్పను" అని మాటయిచ్చెను. సంజ్ఞ తండ్రియింటికి పోగా తండ్రి ఆమెను మందలించి, " యెట్టి వాడైనను భారత్ను విడిచి సాధ్వియైన ఇల్లాలు ఉండకూడదని" బుద్ధిచెప్పి తిరిగి పంపివేసెను. ఆమె భర్త ఇంటికి పోకుండా, ఒక ఆడ గుర్రమై కురుభూములందలి పచ్చికబయళ్ళలో మేయుచు కాలము గడుపుచుండెను.

ఛాయను సూర్యుడు సంజ్ఞయే యనుకొనుచు ఆమెతో కాపురము చేయుచు, ఆమెయందు సావర్ణుడు, శనైశ్చరుడు అను ఇద్దరు కుమారులను పొందెను. ఛాయకు క్రమముగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోసాగెను. వారిని నిర్లక్ష్యముగా జూచుచుండెను. పిల్లలకును ఆమెయందు ప్రేమాభిమానములు తరుగుచుండెను. ఒకనాడు ఛాయ, తమ యెడల ప్రవర్తించిన తీరునకు కోపము వచ్చి యముడు ఆమెను తన్నుటకు కాలెత్తెను. ఛాయకూడా కోపించి "నీ కాలు విరిగిపోవును గాక" అని శపించెను.
Last   2  3  4  5  6  7  8  9  10  11    Last



No comments:

Post a Comment