Sunday, December 15, 2013

శ్రీ దేవీ భాగవతము8




లబ్జాది పీట శక్తులును, శంఖాది నిధులును ఆమెను పరివేష్టించి యుండును. శ్రీ మహాదేవి విపాశ్వమున నుండుటచేతనే మహాదేవుడు సర్వేశ్వరు డయ్యెను. ఈ గృహము సహస్ర యోజన విస్తీర్ణము గలిగి అంతరిక్షములో నిరాధారముగా నుండును. దీనికి ప్రళయమున సంకోచముగాని, సృష్టి కాలమున వికాసముగాని లేకుండును. దేవ, మనుష్య, నాగాడులలో సిద్దులైనవారీ గృహమున శాశ్వతముగా నివసింతురు. కోరికలు దీర్చెడి కల్పవృక్షము లక్కడ కలవు. రోగము, శోకము, వార్ధక్యము అక్కడ నండువారికి కలుగవు.

అక్కడ కొందరు సాలోక్యముక్తు లుందురు. కొందరు సామీప్య ముక్తు లుందురు. మరికొందరు సాయుజ్యముక్తు లుందురు. మహొన్నత స్థితి గలిగించు సప్తకోటి మహామంత్రములు మూర్తి మంతములై దేవిని స్తుతించుచుండును.

ఇది మణిద్వీపవర్ణనము. దీనిని స్మరించిన వారికి సర్వపాపములు తొలగును. ప్రాణము పోవునప్పుడీ మణిద్వీపము స్మృతికి దగిలినచో వానికి ఈ ద్వీపమున దేవీ సాన్నిధ్యము దొరకును. దీనిని నిత్య పారాయణము చేయువారికి దేవీ యనుగ్రహము లభించును. విశేషించి నూతన గృహప్రవేశ సమయమున పారాయణ చేసినచో ఆ యింటిలో నుండువారికి భూతాది బాధలుండవు. ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణముగా నుండును. శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతీ స్వరూప శ్రీ లలితాంబికాను గ్రహము వలన సకల శుభములును గలుగును.   

"సర్వేలోకాయ మాశ్రిత్య వర్ధంతే వీత కల్మషాః
పురాణ పురుషం వందే విశ్వ విజ్ఞాన భాస్కరమ్ "

ఇది "వేదార్ధ ప్రవీణ, "సర్వశాస్త్రా లంకార "
బ్రహ్మశ్రీ   కొంపల్లె సత్యనారాయణ శాస్త్రి, శేషమాంబా పుణ్యదంపతీ
తనూభవ వేంకట రామశాస్త్రి ప్రణీతమైన
                                                         " అష్టాదశ పురాణములు "  
                                                             గ్రంథము సంపూర్ణము.
                                                                  ఇతి శుభమ్.



No comments:

Post a Comment