Friday, December 20, 2013

శ్రీ స్కంద పురాణము8




చంద్రాంగదుడను రాజు భద్రాయువు గుణ గణములను వినియుండెను. శివయోగి చంద్రాంగదునితో నీ కుమార్తె కీర్తి మాలినికి యోగ్యుడైన వరుడతడే కావున అతనికిచ్చి వివాహము చేయుము." అని చెప్పెను .పూర్వ జన్మములో వేశ్యయై యుండి కూడా శివయోగిని సేవించిన పుణ్యము వలన చంద్రాంగదున కామె కుమార్తెగా పుట్టెను. ఆ సంగతి తెలిసియే శివయోగి వారిద్దరినికిని పెండ్లి జరిపించెను.
భద్రాయువు రాజ్యమునకు వచ్చెను . ప్రజలను కన్న తండ్రివలె పాలించు చుండెను. ఒకనాడు భార్య కీర్తి మాలినితో గలసి అరణ్యము నందు విహరించుటకు వెళ్ళెను .అక్కడ ఒక బ్రాహ్మణ మిధునము వచ్చి రాజును దర్శించి వెళ్ళుచుండెను. వారిని ఒక పెద్దపులి తరుముకొని వచ్చెను. వారు భయముతో ఆర్తనాదములు చేసిరి. భద్రయువు పరుగెత్తి పోయి ఆ పులిని బాణములతో గొట్టెను . అది చలించలేదు .వివిధ శస్త్రాస్త్రములు ప్రయోగించెను. గాని అవి పులి నేమియు చేయలేక పోయినవి .పులి వచ్చి బ్రాహ్మణ స్త్రీని బట్టుకొని చంపి తినివేసెను. బ్రాహ్మణుడు గోలు గోలున నేడ్చుచు ,"రాజా ! నీవు ప్రజలను కాపాడ లేక పోతివి. నీ రాజ రిక మెందుకు ? ఇప్పుడు నా భార్య పులి నోట బడి మరణించినది . నాకు యజ్ఞాగ్ని హొత్రాదులు సాగుట యెట్లు.? అందుచేత నీ భార్యను నాకిచ్చి పొమ్ము " అనెను. రాజు ఆశ్చర్య పడి ,"ఓయీ బ్రాహ్మణా ! నీవు ధర్మములు తెలిసిన వాడవు .పరుని భార్యను కోరవచ్చునా ?" అని యడుగగా అతడా మాటలు వినిపించుకోక యేడ్చు చుండెను. అప్పుడు రాజు "దుఖములో నున్న బ్రాహ్మణుని ప్రాణము లిచ్చి నైనను శాంతింప చేయవలెను . ఈయన నా భార్య నడుగుచున్నాడు .ఇచ్చి ఇతని దుఃఖము పోగొట్టేదనని " నిశ్చయించు కొని "ఓ భూసురా !ఇదిగో నీవు కోరినట్లే నా భార్యను దానమిచ్చు చున్నాను గ్రహింపు " మని దాన ధార నతని చేతిలో విడిచెను .
వెంటనే ఆ బ్రాహ్మణుడు గజ చర్మముతోను ,సర్పాభరణములతోను, చంద్రరేఖతోను, జటా జూటముతోను పరమ శివుడుగా ప్రత్యక్షమై," ఓ రాజా ! నీ భూత దయను పరీక్షించు టకై నేనే బ్రాహ్మణ రూపమున వచ్చితిని. పులి నోటబడిన స్త్రీ పార్వతి .పులి యన్నది నా మాయా విలాసము నీ త్యాగ బుద్దికి సంతోషించినాను .కావలసిన వరములు కోరుకొనుము " అని పలుకగా రాజు ఆయనకు సాష్టాంగ దండ ప్రణామములు చేసి భక్తితో స్తుతించి ," పరమేశ్వరా ! నీ దర్శనము కలుగుటచే నేను ధన్యుడ నైతిని .నన్ను ,నా భార్యను , నాతల్లి దండ్రులను ,నన్ను పెంచిన పద్మాకర దంపతులను గూడ నీ గణములలో జేర్చుకొని సర్వదా నీ సాన్నిధ్య భాగ్యమును మాకు ప్రసాదింపుము" అని వేడుకొనెను. మాలిని వచ్చి నమస్కరించి ,"దేవదేవా ! నా తల్లి దండ్రులకు కూడ నీ సాన్నిధ్యమును ప్రసాదింపు "మనెను. పరమేశ్వరుడు వారికావరము లిచ్చి యద్రుశ్యుడయ్యెను.


 First  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last  

No comments:

Post a Comment