చేయగా, మనోహర నీలవర్ణ దేహముతోను, పీతాంబరముతోను, తులసీవనమాలికలతోను, శంఖచక్రాది ఆయుధములతోను, ఫాలమున కస్తూరీ తిలకముతోను, శిరస్సున మయూర పించముతోడి కిరీటముతోను, దివ్యమైన శరీరకాంతితోను
జగన్నాథుడు ప్రత్యక్షమయ్యెను. అట్లు తన ఎదుట సాక్షాత్కరించిన
జగన్నాథుని జూచి అమితానందభరిత హృదయుడై " ఓ పుండరీకాక్ష! నీవు నన్ను
అనుగ్రహించుట చేత నా టపాసు ఫలించెను. నాజన్మము సార్ధకమైనది "అనుచు ఆ
సర్వేశ్వరుని తనశక్తి కొలది స్తుతించెను. అప్పుడా జగదీశ్వరుడు, "మునిరాజా! నీవు పరమ భక్తిభావముతో
చేసిన తాపమునకు మెచ్చితిని. నన్ను పరమభక్తితో సేవించిన
వారెవ్వరైనను నా పరమపదమును పొందుదురు. అటువంటప్పుడు బ్రాహ్మణుడవు, వేదవేదాంగవేత్తవు, సదాచారుడవు, మద్భక్తిపరాయణుడవు, నీకు ప్రసన్నుడనగుటకు ఆశ్చర్యమేమి? ఏమి వరము కావలెనో కోరుకొనుము "అనగా ముని, "కరుణా సముద్రుడా! నేను ఈ అశాశ్వత
ప్రపంచములో భోగములు కోరి కాలము వ్యర్ధము చేసితిని. అడంతయు స్వప్నమువలె
నశించినది. శాశ్వతమైన పరమపదము బొందవలెనని కోరుచున్నాను. నన్ను
అనుగ్రహింపుము" అని ప్రణామము చేయగా ఆ భక్తవరదుడు
కుండుమునికి మోక్షము నొసంగెను.
పురుషోత్తముని మహాత్మ్యమును, ఆయన నివసించిన ఆ క్షేత్ర
మహత్యమును చదివిన వారును, వినిన వారును కుండుముని పొందినట్టి
సుగతిని పొందుదురు. అని బ్రహ్మదేవుడు మహామునులకు చెప్పెననుచు సూతుడు
మునులకు వినిపించెను.
పిండ దేహొత్పత్తి
ఆకాశము నుండి వాయువు పుట్టును. అతనికి
అగ్ని ప్రాణము వంటివాడు. దివము(ఆకాశము) నకు గూడ ప్రాణము అగ్నియే. అగ్నికి
ప్రాణము మధుసూదనుడు. అగ్నినుండి రసము పుట్టును.రసము (నీరు) నుండి
శోణితము పుట్టును. ఆ రక్తమునుండి మాంసము గలుగును. మాంసము నుండి మజ్జ
పుట్టును. మజ్జనుండి శుక్రము జనించును. శుక్రము వలన గర్భము గలుగును. ఇన్నింటికిని
రసమే ప్రథానమని గ్రహింపవలెను. ఆ గర్భములో జలము మొదటి భాగము. ఆ
జలమును సౌమ్యరాశి యందురు. ఊష్మము (వాయువు) వల్ల ఏర్పడిన గర్భము
ద్వితీయభాగమగును. శుక్రము సోమాత్మకము. శోణితము అగ్న్యాత్మకము. బీజము నందు
చంద్రాగ్ని భాగములు ఇమిడి యుండును. కఫమునకు జన్మస్థానము హృదయము. పిత్తమునకు
జన్మస్థానము నాభిప్రదేశము. శరీర మధ్య భాగమునందున్న హృదయము మనస్సుండెడి
స్థానము. మనస్సు ప్రజాపతి. కఫము సోముడు, పిత్తము అగ్ని- ఇట్లు జగత్తంతయు
అగ్నీషోమాత్మకముగా నుండును. (అగ్ని - చంద్ర స్వరూపము).
No comments:
Post a Comment