రుద్రాధ్యాయ మనగా శివుని విశ్వ రూపమును వర్ణించు మంత్ర భాగము .దీనికే నమకమనియు ,శత రుద్రియ మనియు పేరులు గలవు. సంప్రదాయజ్ఞులు నమకము, చమకము , పురుష సూక్తము మున్నగు మంత్రములతో శివునికి ఒకసారి గాని ,మూడు సారులు గాని ,ఐదుసారులు గాని , ఏడుసారులు గాని , తొమ్మిది సారులు గాని, పదునొక్క సారులు గాని, యభిషేకము చేయుదురు.
ఈ నమకమును బ్రహ్మ తన దక్షిణ ముఖము నుండి యజుర్వేదముతో సహా ఉచ్చరించెను. ఇది సకలోపనిషత్తులకును సార భూతమైనది .మరీచి మున్నగు మహర్షు లందరును దీని నధ్యయనము చేసినారు.
శ్లో || ఏష ఏవ పరో మంత్రః ఏష ఏవ పరం తపః
రుద్రాధ్యాయ జపః పుంసాం పరం కైవల్య సాధనమ్
ఈ రుద్రాధ్యాయము సర్వోత్తమమైన మంత్రము ఇదియే గొప్ప తపము ఇది జపించుట కేవల ముక్తి సాధనము.
కామ క్రోధ లోభాది షడ్వర్గ ములను నాశన మొనర్చి కైవల్యమును ప్రసాదించును.
నమక పారాయణమును ,రుద్రాభిషేకము ను చేయువారి జోలికి మేము పోలేమని యమ భటులు యమునితో విన్నవించుకొనిరి. రుద్రాభిషేకము చేయువారికి అన్న వస్త్రములకును ,ఐశ్వర్య ములకును లోపము ఎప్పుడును కలుగదు. సర్వత్ర విజయము లభించును .ఆయువు ,ఆరోగ్యము లభించును.
శ్లో || " రుద్రాధ్యాయీ వసేద్యత్ర గ్రామే వానగరే పివా |
న తత్ర క్షుత్పి పాసాద్యా దుర్భిక్ష వ్యాద యోపిచ ||
తా || ఒక్క రుద్ర పారాయణ పరుడు గ్రామమున గాని, నగరమున గాని నివసించు చున్నచో అక్కడ ఆకలి దప్పులు గాని ,కరువు కాటకములు గాని ,వ్యాధులు గాని ఉండవు. (" ఆకలి దప్పులుండవు " అనగా అన్నోదకములకు లోపము కలుగదని యర్ధము )
No comments:
Post a Comment