Friday, December 20, 2013

శ్రీ స్కంద పురాణము5




వారు సంకోచించుచునే చంద్రాంగదుని భార్య చేయు వ్రతమునకు దంపతులుగా వెళ్ళిరి. ఆమె వీరిని జూచి ,నిజము గ్రహించి నవ్వుకుని ,పీటముపై కూర్చుండ బెట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావించి సమస్తోపచారములతో యధావిధిగా పూజించెను. షడ్ర సోపేతమైన విందు చేసి అపారమైన ధనమును దక్షిణగా నిచ్చి సాగ నంపెను.

వారు తిరిగి వచ్చు చుండగా దారిలో సామవంతుడు సుమేధునితో ప్రణయ సంభాషణ మొదలు పెట్టెను .సుమేధనుడు ," ఏమిరా ! నిజముగా ఆడుదానివలె మాట్లాడు చున్నావేమి ? నీవు మగవాడవు. అది గుర్తుంచుకుని మసలుము." అనగా సామవంతుడు " నేను ఇప్పుడు మగవాడను గాను స్త్రీ నైపోతిని నీవు నాకు నచ్చినావు నాతో విహరింపు " మనెను . సుమేధుడాశ్చర్య పడి ఆమెను నిశితముగా చూచెను. సామవంతుడు నిజముగా స్త్రీ యయ్యెను .సుమేధుడు " నీవు నిజముగా స్త్రీ వైనచో ,నీ తండ్రి నాకు నిన్నిచ్చినచో మనము దంపతుల మగుదము. పోవుదము రమ్ము " అని ఇంటికి దెచ్చెను.
విషయము తెలిసి వేద మిత్ర సారస్వతు లాశ్చర్య పడిరి . సారస్వతుడు తన ఏకైక కుమారుడు స్త్రీ యైనందుకు విచారించుచు రాజు వద్దకు బోయి ," నీ ధూర్తత్వము వలన నా కొడుకు స్త్రీ గా మారినాడు. నాకు వంశాభి వృద్ది చేయు కుమారుని నీవిట్లు చేసినావు .రాజుల కిట్టి పరాచికములు తగునా ?" యని పలికెను.
రాజు ,అతడు నిజముగా స్త్రీగా మారెనని తెలిసికొని ,సోమవార వ్రత మహత్యమును గ్రహింప లేక తాను చేసిన శివాపరాధమునకు పశ్చాత్తాపము నొంది, వీరందరితో గలసి దేవి యాలయమునకు వెళ్లి నియమముతో నిరాహారుడై మూడు దినములు జగన్మాత నారధించెను . దేవి ప్రత్యక్షము కాగా , రాజు ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసి తన యాపరాధమును మన్నింపు మని ప్రార్ధించి , "తల్లీ ! ఈ స్త్రీ గా మారిన యువకుని మరల పురుషునిగా జేయు " మని యడిగెను. ఆ తల్లి " రాజా ! నా భక్తురాలి భావనను మార్చు శక్తి నాకు లేదు .ఈమె సుమేదునికి భార్య యగును .సారస్వతునికివంశోద్దారకుడైన  కుమారుడు కలుగును " అని వరములిచ్చెను.
జగన్మాత చెప్పినట్లు సామవతిని సుమేధునికి కిచ్చి సారస్వతుడు పెండ్లి చేసెను .అతనికి తరువాత ఒక కొడుకు పుట్టెను. వారు పరమ సంతోష భరితులైరి.


 First  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last  




No comments:

Post a Comment